పుట:2015.373190.Athma-Charitramu.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 582

వెళ్లి, అ చల్లనిప్రదేశమున కాలము గడిపెను. నేను మా తమ్మునితోను, ఆతని పిల్లలతోను భీమవరమునందుండి, అచట మా సోదరులము గట్టుచుండు క్రొత్తయింటి పనులు పూర్తి చేయించుచుంటిని. ఆ సంవత్సరము విజయదశమిపండుగ నాఁడు ఆ గృహప్రవేశ మహోత్సవము జరిగెను.

ఆంధ్రవిశ్వవిద్యాలయమువా రిపుడు తమపరీక్షలు చేయఁ దొడంగి, ఇంటరుమీడియేటుపరీక్షలో నాంగ్ల సాహిత్యమున నన్నొక ముఖ్యపరీక్షకునిగ నియమించిరి.

ఆ సంవత్సరము అక్టోబరు నెల చివరభాగమున నెల్లూరులో పెద్ద తుపాను సంభవించెను. మేముండెడి యింటిసామానుకొట్టులో నింటనుండు చిన్న పెద్దలందఱుమును ఆరాత్రి తల దాఁచుకొంటిమి. మా మఱఁదలు చామాలమ్మ కుమారుని కడపటిపిల్లవాఁడు, కొన్ని నెలలవాఁడు, వానియక్క లిద్దఱును, తల్లియును, మాతోనె యుండిరి. గాలితాఁకుడున కింటిపెంకులు దొరలిపడుచుండెను. దూరపుచెట్ల కొమ్మ లెగిరివచ్చి గుమ్మములయొద్ద పడుచుండెను.

పది నిముషముల కొకమాఱు గాలిహెచ్చుచు, బందిపోటు దొంగల గుమివలె తలుపులు గుభేలున గొట్టుచుండెను ! ఆరాత్రి మేము జీవింతుమని తోఁపలేదు. తెల్లవాఱునప్పటికి పురమంతయు మ్రోడుపడిన వృక్షమువలెఁ దోఁచెను. ఎచటఁ జూచినను పడిపోయిన గోడలు, కూలిపోయినచెట్లు, రాలినకొమ్మలు రెమ్మలును ! ఈ గాలి వానను వర్ణించుచు "ముద్దుకృష్ణ" అను నొక కథనువ్రాసి, "భారతి" కంపితిని. దీనిలో ప్రకృతి వైపరీత్యమునకుఁ బ్రతిగా మనుజులప్రేమము వర్ణింపఁబడియెను.