పుట:2015.373190.Athma-Charitramu.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. నెల్లూరు గాలివాన 581

మీఁద నామెపేరిట నొక నీటికొళాయి స్తంభము కట్టించితిని. "రాయసం రత్నమ్మగారిధర్మము" అని యందలి ముఖఫలకముమీఁదఁ జిత్రింపఁబడియెను.

ఈ సంవత్సరము మార్చినెలలో మా మేనల్లుఁడు బుచ్చిరామయ్యకు సన్నిపాతజ్వరమువచ్చి మూఁడువారములు వేధించెను. వ్యాధి యింటిలోని యితరపిల్లలకు సోఁకకుండ మేము జాగ్రతపడితిమి. దంపతుల మిరువురమును రాత్రులు నిద్దుర గట్టిపెట్టి, రోగికిఁ బరిచర్యలు చేసితిమి. దైవానుగ్రహమునను, ఋషిసదృశ శీలుఁడగు శ్రీమాతులుల్లా వైద్యశిఖామణి వైద్యప్రభావమునను రోగి యొక నెలలోనె పరిపూర్ణారోగ్యవంతుఁ డయ్యెను.

ఇదివఱకు ఆంధ్రమండలములలో బ్రాహ్మమతప్రచారము సలిపి, నేత్రావరోధము గలిగి యిపుడు మంచమెక్కిన హేమచంద్ర సర్కారుగారి సంరక్షణమునకై నేను గొంత ధనసాహాయ్యము చేసితిని. నా మిత్రులు, కవిపుంగవులునగు బ్ర. శ్రీ. చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి షష్ఠిపూర్తి సందర్భమున వెలువడిన వారి సంపూర్ణగ్రంథావళికి నా శక్తికొలఁదిని తోడుపడి, సంతుష్ట హృదయుఁడ నైతిని.

ఆ సంవత్సరము వేసవి సెలవులలో వెలిచేరులో మా బావమఱఁదియింట జరిగిన రెండు శుభకార్యములలో నొకటి, జబ్బుపడి లేచిన బుచ్చిరామయ్య కుపనయనమహోత్సవము. ఆతనిని మరల సంపూర్ణారోగ్యవంతునిగఁ జేసి, తలిదండ్రుల కొప్పగింపఁ గలిగినందుకు మేముభయులము ముద మందితిమి. ఆ వేసవిని నా భార్య, కొండ వేంకటప్పయ్యగారి పత్నీపుత్రికలతో బెంగుళూరు