పుట:2015.373190.Athma-Charitramu.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. నెల్లూరు గాలివాన 577

టికి వచ్చి కూర్చుండుచు, నాభార్యతో ముచ్చటించుచు, కాలము గడుపు చుండెడిది. ఆమెకుఁ జేత నైనంత సాయము చేయుచుండు వారము. 1925 వ సంవత్సరాంతమున నామె కాలధర్మము నొందెను. చనిపోవునపు డామె కొంచెము సొమ్ము నాభార్యచేతి కిచ్చి, దానితోఁ దన పేరిట నే ధర్మకార్యమైన నెలకొల్పుఁ డని కోరెను. కావున 1926 వ సంవత్సరము అక్టోబరు నెలలో ఆమెపేర ట్రంకురోడ్డుమీఁద పశువులు నీరు ద్రావుట కనువగు నీటితొట్టి నొకటి పురపాలక సంఘము వారిచేఁ గట్టించి, అద్దాని ముఖఫలకముమీఁద "దోరనాల కనకమ్మధర్మము" అని వ్రాయించితిని. ఆ డిశెంబరు నెలలో మా తమ్ముఁడు కృష్ణమూర్తి సకుటుంబముగ చెన్నపురి పోవుచు, మార్గ మధ్యమున నెల్లూరునఁ గొన్ని దినములు నిలిచెను. అంత మా చెల్లెలితోఁ గలసి వా రందఱును చెన్నపురి వెళ్లిరి. న్యాయవాదిపరీక్షలో మొదటితరగతిని మా తమ్ముఁ డపుడు జయమందెను. సెలవులలో మేము గుంటూరు వెళ్లి వచ్చితిమి.

27. నెల్లూరు గాలివాన

నూతనముగ స్థాపిత మయిన కళాశాలలో నా కిపుడు పూర్తిగఁ బను లున్నను, ఎటులొ తీఱికచేసికొని, కథలు వ్యాసములును వ్రాయుచువచ్చితిని. నాకు వలసినంత వ్యవధానము లేకుండుటయె యాకాలమున నేను చిన్నకథ లల్లుట కొకకారణము. చిన్న కథలని నేను వానిరచనమున నశ్రద్ధఁ బూనువాఁడనుకాను. కథాచమత్కృతియందుఁగాని, శైలిసొబగునఁగాని, యేలోపము గనఁబడినను, దానినిఁ దొలఁగించువఱకును, నాకుఁ దోఁచెడిదికాదు ! మొదటిప్రతి వ్రాసిన కొన్నిదినములకుఁగాని నాకథ సిద్ధమయ్యెడికాదు. కథ నెన్నిమాఱులో