పుట:2015.373190.Athma-Charitramu.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 574

మా సోదరుఁడు వెంకటరామయ్య తాను తీవ్రదు:ఖావేశపరవశుఁడయ్యును, సుతులకు ధైర్యముచెప్పు బాధ్యత వహింపవలసివచ్చి, ఎంతయో యోరిమి దాల్చి, సంసారకార్యములు చక్క పెట్టుకొనవలసి వచ్చెను.

ఆకష్టసమయమున మాతమ్మునిచెంత నేను లేను. మఱఁదలికి వ్యాధి ప్రకోపించెనను తంత్రీవార్త నందుకొని, కొలఁది నెలలక్రిందటనె ప్రసవమైన వారిపెద్దకోడలిని శిశువును మేము ఉభయులము వెంటఁ దీసికొని, నెల్లూరునుండి బయలుదేఱి భీమవరము చేరునప్పటికె, మాకు దు:ఖవార్త తెలియవచ్చెను. ఇది జరిగిన యొకటి రెండు నెలలోనె వెంకటరామయ్య కుమార్తె చిన్నశిశువు, ఆయేఁట వేడిగాడుపులకు తాళ లేక చనిపోయెను. వేసవి తుదిదినములలో మాతమ్ముఁడు నేను జెన్నపురి పోయితిమి. అచ్చటి నేత్రవైద్యుఁ డాతని కనులు పరీక్షించి, వానికి సులోచనము లిచ్చెను. ఇవి పెట్టుకొనుటవలన మాతమ్మునికిఁ జూపు చక్కపడెను.

ఈసంవత్సర మధ్యమున నా "వ్యాసావళి" రెండవభాగము ఏలూరులో ముద్రింపఁ బడెను. ఈరెండుపుస్తకములలోను, నే నిదివఱకు నా పత్రికలలో వ్రాసిన మంచి వ్యాసములె కాక, 'ఆంధ్రపత్రిక' సంవత్సరాది సంచికలందును, ఇతర పత్రికలందును ముద్రణ మయిన నా వ్యాసోపన్యాసములలో ముఖ్యమగు నవియును, బ్రకటింపఁబడియెను. నా వ్యాసములలో నెల్ల 'పుత్రలాలన' 'పతివిలాసిని' 'ఉత్తర గోగ్రహణము' 'అత్తకోడండ్రపొత్తు' ముఖ్యములు. మా తమ్ముఁడు వెంకటరామయ్య వ్రాసిన "జంతుకోటి ప్రాణరక్షణోపాయముల" నాలుగు భాగములును, జంతు స్వభావ చారిత్రక వినోదవిషయములతోఁ గూడుకొని యున్నవి. నాయుప