పుట:2015.373190.Athma-Charitramu.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 570

మూర్తి తృతీయ పుత్రిక కామేశ్వరమ్మ వివాహసమయమున నందినవి. ఆ వివాహమునకు సకుటుంబముగ నేను గుంటూరునుండి యా వేసవిని వచ్చియుంటిని. అదివఱకుఁ గొలఁది దినముల క్రిందటనె గుంటూరు కృష్ణామండలములలో ప్రబలమగు గాలివాన వీచి, జనులకును జంతుజాలమునకును జాల నష్టము గలిగించెను. ఈ తుపాను నాధారము చేసికొని, "గాలివాన" అను శీర్షికతో నే నొక కథను గల్పించి, కృష్ణాపత్రికలోఁ బ్రచురించితిని.

ఆ మెయినెలలో రామాముద్రాలయమున నా "ఇంగ్లీషు వారి సంసారపద్ధతులు" పునర్ముద్రిత మయ్యెను. చిరకాలము క్రిందట నేను 'సత్యసంవర్థని,' 'జనానాపత్రికల'కు వ్రాసిన చిన్న వ్యాసములును, ఇటీవల నప్పు డప్పుడు బహిరంగ సభలలోను సమావేశములలోను జదివిన యుపన్యాసములును, శిథిల మగుచుండెడి ప్రాఁత పత్రికలనుండి తీసి యిపుడు "వ్యాసావళి" యను పేరిట రామా ముద్రాలయమున కచ్చున కంపితిని. ఈ పుస్తకము రెండుభాగముల యచ్చు చిత్తులను దిద్దుపట్ల శ్రీ మున్నంగి లక్ష్మీనరసింహ శర్మగారు నాకుఁ దోడుపడిరి. సామాన్యముగ నా పుస్తకముల తుది యచ్చు చిత్తులు నేనె దిద్దుకొనినఁ గాని నాకు సంతృప్తి గలుగదు. ఐనను, సెలవుదినములలో నే నొకచోట నుండక తిరుగుచుండుటవలన, ముద్రణసౌకర్యమునకై రామాముద్రాలయమువారీ ప్రత్యేక మగు నేర్పాటు చేసిరి. 1925 వ సంవత్సరము జూను నెలలో "వ్యాసావళి" మొదటి భాగమును, మఱుసటి సంవత్సరము ఏప్రిలులో రెండవ భాగమును ప్రచుర మయ్యెను.

1925 వ సంవత్సరమున వేసవితుదిని మా తమ్ముఁడు వెంకటరామయ్య, వ్యాధిగ్రస్తయగు తనభార్య రత్నమ్మను నెల్లూరు