పుట:2015.373190.Athma-Charitramu.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. నెల్లూరునివాసము: రెండవవత్సరము 559

గుంటూరిలో నేను వెనుకఁగట్టిన యింటికి వసారా దింపి, యిల్లు పూర్తిపఱిచితిని, మందిరముకూడ సిద్ధమయ్యెను.

గుంటూరిలో "మండలప్రాథమిక విద్యాబోధకుల" సమావేశ సందర్భమున నేను 15 వ మేయిని అధ్యక్షత వహించితిని. నా ప్రారంభోపన్యాసమున, బోధకవృత్తి గౌరవనీయమైన దని చెప్పి, సందర్భానుసారముగ గాంధిమహ్మాత్ముని సహాయ నిరాకరణోద్యమమును గూర్చి యుపాధ్యాయుని కర్తవ్యము తెలియఁబఱిచితిని. సభ జయప్రదముగ జరిగెను. జీతములు సరిగా నీయకుండుటచేత తాము ఉద్యోగములు వదలుకొందు మని బోధకులు అదివఱకు చేసికొనిన తీర్మానము నా సలహా ననుసరించి విరమింపఁ బడెను.

ఈ దినములలోనె మిత్రులు వెంకటప్పయ్యగారి రెండవకొమార్తె పార్వతమ్మవివాహము జరిగెను. మాతమ్ముఁడు వెంకటరామయ్యద్వితీయపుత్రుఁడు సుబ్బారాయనికి, అతని మేనమామ మంత్రిరావు వెంకటరత్నముగారి పుత్రిక లక్ష్మీకాంతమ్మకును తణుకులో వివాహము జరిగెను. ఆముహూర్తముననె మా పెదతండ్రికుమారుఁడు వీరభద్రుని జ్యేష్ఠపుత్రుఁడు సాంబశివరావునకు వంగూరి శంకరముగారి పెద్దకొమార్తె మాచరమ్మనిచ్చి పెండ్లి చేసిరి.

1921 వ సంవత్సరము జులై నుండియు మాకళాశాలలో ప్రకృతి గణితశాస్త్రములు నేర్పుట కేర్పాటు లయ్యెను. నా మఱఁదలు లక్ష్మమ్మరెండవకుమారుఁడు పోడూరి నారాయణరావు నెల్లూరు కళాశాలలో రెండవతరగతిలోఁ జేరి యిపుడు చదివెను. నా పెద్దమఱఁదలు చామాలమ్మ పెద్దయల్లుఁడు ర్యాలి శేషగిరిరావు, ఇదివఱకు ఏలూరు పాఠశాలలో నుపాధ్యాయుఁడుగనుండి, యిపుడు నెల్లూరు పాఠశాలలోఁ జేరి, తనభార్య రామమ్మతో వచ్చియుండెను.