పుట:2015.373190.Athma-Charitramu.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 558

యొక పలకమీఁద వ్రాసి చూపించెను ! ఇది నా కాశ్చర్యము గొలిపెను. కాని, వాని కాయన యిచ్చిన ప్రత్యుత్తరములలో ననేకములుమాత్రము సరిగ లేవు.

మహాత్మాగాంధిగారు 7 వ తేదీని నెల్లూరు దయచేసిరి. కళాశాలా క్రీడారంగమునందలి మైదానమున గొప్పబహిరంగసభ జరిగెను. ఆయనకు రెండు స్వాగతపత్రములు నెల్లూరిపౌరులు నివేదించిరి. పలువురు సొమ్ము నగలును విరాళ మిచ్చిరి. ఆ సందర్భమున వచ్చిన కొండ వెంకటప్పయ్యగారు మాయింట బసచేసిరి.

8 వ యేప్రిలునఁ గూడిన కళాశాలాపరిపాలకవర్గసభలో వెనుకటి యుపాధ్యాయుని లోపములను గూర్చి నేను జెప్పితిని. కార్యదర్శి నరసింహాచార్యులుగారు నా వాక్యములు బలపఱిచిరి. మా కిద్దఱికి నింక పొసఁగ దని సభ్యులు గ్రహించి, ఆయనను కళాశాల వీడుఁడని చెప్పివేయుటకు తీర్మానము చేసిరి. ఆబోధకుని యవస్థకు నేను మిగుల చింతిల్లినను, ముందు కళాశాలలో పని క్రమముగ జరుగఁగల దని యాశించితిని.

వేసవి సెలవులు గడప నేను గుంటూరు వెడలిపోయిన కొలఁదిదినములకె నాకు నెల్లూరునుండి జాబు వచ్చెను. ఆ యుపాధ్యాయుఁడు జరిగినదానికి విచారించుచుండి రనియు, ఆయనను కళాశాలలో నుంచుట కొడఁబడుఁ డనియు, నా పూర్వసహపాఠియు నిపుడు నెల్లూరులో సబు జడ్జియు నగు సోమంచి నీలకంఠముగారు నాకు వ్రాసిరి. గుంటూరిలోని నా పూర్వమిత్రులు జంధ్యాల నాగభూషణముగారుకూడ నిటులే నన్నుఁగోరిరి. కావున మొదట నాకిష్టములేకుండినను, పిమ్మట నా యుపాధ్యాయుని కళాశాలలో నుంచవచ్చు నని కార్యదర్శికి నేను వ్రాసితిని.