పుట:2015.373190.Athma-Charitramu.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 556

యిటీవల సంవత్సరమునుండి రెండు సంవత్సరములు పొడిగింపఁబడినది. బోధకులకు పరీక్షాధికారులకును వైషమ్యములు గానవచ్చుచున్నవి. దేశభాష తెలిసినవారే కాక, ఆభాష మాతృభాషగాఁ గల స్వదేశీయులును పరీక్షాధికారు లగుట ముఖ్యము." '

నిరుడు శీతకాలమున నేను "కమలాక్షి" యను చిన్న నవలను గుంటూరునందు రచించితిని. ఇపు డది యీశీతకాలపు సెలవులలోఁ జదివి, దానిలోఁ గొన్ని మార్పులు చేసి, నామిత్రులును, కళాశాలలో నాంధ్రపండితులును నగు శ్రీ సుబ్రహ్మణ్యశర్మగారికిఁ జూపితిని. అది ప్రచురించుటకు యోగ్యముగ నుండె నని వా రభిప్రాయపడిరి.

మా కళాశాలా విద్యార్థులకు శరీరవ్యాయామ మేమియు లేకుండుటకు నేను వగచితిని. అనుదినమును డంబెల్సుతో కసరతు చేయుఁ డని నేను నావిద్యార్థులకు బోధించి, కొన్ని దినములు వారిచే నావ్యాయామము చేయించితిని. కొన్ని దినములవఱకును వా రాసాధకము చేసి, పిదప మెల్ల మెల్లగ దానిని మానివేసిరి.

ఒకనాఁడు కళాశాలాపఠనాలయపుగదిలో విద్యార్థులకేకలు విని, నేను వారిని వారించితిని. అంతట నొక విద్యార్థి ప్రేరేపణమునఁ దక్కినవారిలోఁ గొందఱు నాతరగతిలోనికిఁ గొన్నిరోజులవఱకును రాకుండ సమ్మె కట్టిరి. పిమ్మట నేను తరగతిలో వారితో మాటాడి సమ్మెలో నుండువారిని క్షమించితిని. అంత పరిస్థితులు యథాప్రకారముగ నడువఁ జొచ్చెను.

1921 సం. ఫిబ్రవరి మాసమధ్యమున "యూనివర్సిటీ కమీషను" వారు మాకళాశాలను సందర్శింప వచ్చిరి. ఇంక ముందు కళాశాలలో తెలుఁగునకుఁ దోడుగ ఉర్దు, అఱవము,