పుట:2015.373190.Athma-Charitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. రాజమహేంద్రవరము 21

6. రాజమహేంద్రవరము

రేలంగి పాఠశాలలోని మిక్కిలి పెద్దతరగతిపరీక్షలో జయమంది, నేనును మఱికొందఱు విద్యార్థులును మా ప్రథమోపాధ్యాయు వొద్ద ప్రత్యేకముగ నింగ్లీషు మూఁడవపాఠపుస్తకము చదువ నారంభించితిమి. ఇట్టి యసంపూర్ణ ప్రయత్నములవలన నంతగ లాభము లేదని గ్రహించి, మాతలిదండ్రులు మాయున్నతవిద్యాభివృద్ధికై మమ్ము రాజమంద్రి కొనిపోఁదలఁచిరి. మారెండవ పెత్తండ్రి పెద్దకొడుకు నాగరాజు, వయస్సున నాకంటె నైదారేండ్లు పెద్దవాఁడు, ఆంగ్ల విద్యనిమిత్తమై రాజంద్రి యంతకుమునుపే వెడలిపోయెను. దేశమంతయు తిరిగి, ఇంగ్లీషువిద్య నేర్చినవారికే యెల్లెడల నున్నతపదవులు లభించుట కనిపెట్టిన మాజనకుఁడు, మే మింక స్వగ్రామమున నుండుట ప్రయోజనకారి కా దనియు, కుటుంబమును పట్టణమునకుఁ జేర్చినచో మరల తనకుద్యోగసంపాదనమును మావిద్యాపరిపోషణమును గలుగు నని యెంచి, 1882 సం. జూలైనెలలో మమ్మందఱిని రాజమంద్రికిఁ గొనిపోయెను. ఇన్నిసుపేటలోని గొట్టుముక్కలవారి యింటిలోని మొదటిభాగము, పూర్వము మా మేనమామలు నివసించి యుండునది. మే మిప్పుడు నెల కొకరూపాయ యద్దెకుఁ బుచ్చుకొంటిమి. ఇప్పటివలె నింటిమీఁద నిల్లుండి, దోమలకును దుర్వాసనలకును తావలము గాక, ఆకాలమం దా పేట యుద్యానవనమువలెఁ జెన్నొందుచుండెను. మే మున్నయింటిపెరడు విశాలముగ నుండి, చూతనారికేళాది ఫలవృక్షముల కాకరమై, కొనసీమతోఁటవలెఁ జెలువారుచుండెను. పేటమధ్యమున పండ్లయంగడులు కాయగూరల దుకాణములు తదితర వస్తువిక్రయశాలలు నొప్పారుచుండెను. పెద్దవీధి కిరుకెలంకులందును పలురకముల పూలచెట్లు వెలసియుండెను. ఈదృశ్యములు మాచిన్ని