పుట:2015.373190.Athma-Charitramu.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 538

ఈ మార్చి నెల తుదిని మాతమ్ముఁడు వెంకటరామయ్య జ్యేష్ఠ పుత్రుఁడు నరసింహమూర్తి వివాహము రాజమంద్రిలో జరిగెను. మండలన్యాయసభలో పెద్దయుద్యోగి యగు పోడూరి వెంకయ్య గారి పెద్దచెల్లెలు సూర్యకాంతమును వీని కిచ్చిరి. మా కొక పెద్ద భవనము విడిద యయ్యెను. రాజమంద్రిమిత్రులు పలువు రా సందర్భమున మా కగపడిరి. వివాహదినములలో నొకనాఁడు వీరేశలింగము పంతులుగారు మావిడిదకు విచ్చేసిరి. అపుడు వారితోఁ జాలసేపు మాటలాడితిమి. మరల వారి "హితకారిణీ పాఠశాల"లో ప్రథమోపాధ్యాయపదవి ఖాళీ యయ్యెను. ఈతరుణమందైన రాజమంద్రి రావలెనని నే నాలోచించితిని. కాని, యిపుడు కళాశాలలో ప్రథమోపన్యాసకపదవిలో నుండి, కొలఁదికాలములో నధ్యక్షక పదవిని అధికవేతనమును నందనుండు నేను, రాజమంద్రియందలి యీ చిన్న పనికివచ్చుట తగదని వీరేశలింగముగారి యొక్కయు, మిత్రులు పాపయ్య సాంభశివరావుగార్ల యొక్కయు నభిప్రాయము. ఆపాఠశాలలో నిదివఱకు ద్వితీయోపాధ్యాయుఁడును, పర్లాకిమిడిలో నాపూర్వశిష్యుఁడును నగు జయంతి గంగన్న గారి కీ యుద్యోగ మపు డీయఁబడెను.

ఏపిల్ 27 వ తేదీని "ఆస్తిక పుస్తకాలయ" ప్రవేశ మహోత్సవమునకు రమ్మని రాజమంద్రినుండి నాకు పిలుపువచ్చెను. పనితొందరవలన రాలేనని వీరేశలింగముపంతులు పాపయ్యగార్లకు నేను వ్రాసి, నాయొద్దనుండు "మనశ్శక్తి విమర్శనా సంఘము" వారి ప్రచురణము లన్నియును అట్టలు గట్టించి నూతనపుస్తకాలయమున నుంచుఁడని రాజమంద్రి పంపించితిని.

ఆ మేనెల 5 వ తేదినాఁటికి పరీక్షాపత్రములు దిద్దుపని ముగించితిని. ఈ రెండు మూఁడునెలలును నేను పరీక్షా కార్యదీక్ష