పుట:2015.373190.Athma-Charitramu.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. శుభాశుభములు 537

ప్రాప్తిఁ జెందిరి. వీరు సంస్కృతాంధ్రసాహిత్యములందును, గణిత శాస్త్రమందును ప్రతిభావంతులు; వినయాది సుగుణభూషితులు. ఇట్లయ్యును, తమప్రజ్ఞకుఁ దగిన యౌన్నత్యమును విద్యాశాలలోఁ బడయఁజాలకుండిరి. ఇటీవలనె వీరికిఁ గళాశాలతరగతులలో నాంధ్రరచనోపాధ్యాయపదవి యొసంగుఁడని అధ్యక్షులకు నేను సిఫారసు చేసితిని. కాని, యీపని యయిన కొలఁదికాలమునకే వీరికి మృత్యు నాసన్న మయ్యెను ! వృద్ధురాలగు వీరి జనిని యింకను జీవించియే యుండెను ! ఆనెల తొమ్మిదవతేదీని వీరి గౌరవార్థమై జరిగిన బహిరంగసభకు నేనే యధ్యక్షత వహించితిని. ఈయన జ్ఞాపకార్థమై యేదేని శాశ్వతకార్య మొకటి చేయఁ బౌరులు సమకట్టిరి. ఈయనస్థానమున, నాయాలోచన ననుసరించి, కళాశాలా పూర్వ విద్యార్థి కొలచలమ కృష్ణసోమయాజులుగారు నియమింపఁబడిరి.

ఈ నెల 20 వ తేదీని మాచెల్లెలి రెండవకూఁతురు సీతమ్మ వివాహమును, కుమారుఁడు జనార్దనుని యుపనయనమును కాకినాడ దగ్గఱ సర్పవరములో జరిగెను. ఆసమయమున నాఁడువారు పిల్లలు కూడరాఁగా మువ్వురన్న దమ్ములమును అచ్చటకు వెళ్లితిమి.

చనిపోయిన చెల్లెలు కామేశ్వరమ్మభర్త పింగళి సూర్యనారాయణ మరణించెనను దు:ఖవార్త మార్చి 6 వ తేదీని మాకు వినవచ్చెను. ఈతని కిటీవల ద్వితీయవివాహము జరిగి, ఒక కొమార్తెయు నొక కుమారుఁడును గలిగిరి. నిడదవోలు ప్యారీకంపెనీలో గుమాస్తాగానుండు యభివృద్ధి నొందుచుండెడి యీతని కిపుడు మరణ మాసన్న మయ్యెను ! మావెల్లెలికుటుంబ మిట్లు సమూలముగ నాశన మగుట కడు దుస్సహముగ నుండెను !