పుట:2015.373190.Athma-Charitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

మనస్సున వెత నొందుచున్నను, డబ్బుమీఁదఁ గన్ను వేసి, అన్నమాట పోవునను భయమున, నే నెన్ని బాసలకును వెఱవలేదు! నా స్థిరత్వము నా సత్యవాదిత్వమున కమోఘనిదర్శన మని యచట నందఱును రూఢిచేసికొనిరి. ఈసిద్ధాంతమును స్థిరపఱచుట కింకొకసంగతియె కావలెను. అది మా తండ్రి సాక్ష్యము. కాని, దానినిగూర్చి నా కేమియు భయము లేదు. పిమ్మట నేను నెమ్మదిగ మానాయనతో మాటాడి లాభకరమగు నామాటను సమర్థించునటు లాయన నెటులో యొడఁ బఱుపఁగల నని నాయాశయము! కావున నే నీరుజువునకును సమ్మతించి ధైర్యమున నుంటిని.

కాకతాళన్యాయముగ మాతండ్రి యపుడె యాదారిని బోవుచుండెను. అచ్యుతరామయ్య యాయనను గలసికొని, తనపుస్తకపు బాకి నిప్పింపు డని మెల్లగ నడిగెను. ఒకటిరెండు రోజులలో తప్పక యిచ్చివేయుదు నని మానాయన పలికి, అచ్యుతరామయ్య ప్రశ్నింపఁగా, తా నాప్రొద్దున నాచేతికి డబ్బేమియు నీయలే దని చెప్పివేసెను!

పరిభవభారమున నాశిర మంత నేల కొరగిపోయెను! పిమ్మట నేనుగనఁబడినపు డెల్ల, అచ్యుతరామయ్య నన్ను దెప్పుచు, నాయొట్లు బాసలు నాకు జ్ఞప్తికిఁ దెచ్చి, నామనస్సునందలిపుండును రేఁపుచుండువాఁడు! కొంతకాలమువఱకును సహచరులమోములు చూచుటకు నేను సిగ్గుపడుచుండువాఁడను. జరిగిపోయినది మాపుట దుస్సాధ్య మైనను, ముం దిట్టిసత్యములకును మోసపుఁబనులకును బాల్పడనని మనోనిశ్చయము చేసికొంటిని!