పుట:2015.373190.Athma-Charitramu.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. నివేశనస్థల సంపాదనము 535

గుంటూరు ప్రార్థనసమాజమునకు మందిరనిర్మాణము చేయుటకు మేమంత ప్రయత్నించితిమి. స్థలసంపాదనా విషయమున నా కిపుడు కొంత చొరవ గలిగి, 29 వ సెప్టెంబరున సామవేదము నరసింహాచార్యులుగారియొద్ద 412 గజముల స్థలము నేను కొంటిని. నే నంతట వెలిచేరు వెళ్లి బంధువులను పరామర్శించితిని. కాకినాడ పోయి మాచెల్లెలిని, కొంచెము జబ్బుగనుండు మామేన కోడలిని జూచివచ్చితిని. కొంత విశ్రాంతి గలుగుటకై మామామగారిని గుంటూరు కొనివచ్చితిమి. కొలఁదికాలము క్రిందటనె వ్యాధిగ్రస్తుఁడై, మాసములోనె మాతృపత్నీ వియోగములు సంప్రాప్తమయిన మా మామగారిశరీరము రక్తవిహీనమయ్యెను. ఆయనకు గుంటూరినివాసము ఆరోగ్య ప్రదము కాఁగలదని నమ్మితిమి.

దు:ఖములో దు:ఖము సంప్రాప్తమగుచుండును. అధిక విద్యా పరిశ్రమముఁ జేసి, విదేశమున గొప్పయుద్యోగము సంపాదించిన నామిత్రుఁడు బంగారయ్య యిటీవల చనిపోయెనని అక్టోబరు 11 వ తేదీని నాకుఁ దెలిసెను ! పాపము, అతనితలిదండ్రు లింకను జీవించియుండిరి. వారికి బంగారయ్య యొకఁడె కుమారుఁడు ! తనవిద్యకె యిటీవల బంగారయ్యచేసిన ఋణములైన నింకను తీర లేదు ! భార్య సుగుణవతి యగు నిల్లాలు. ఇద్దఱుముగ్గురు చిన్నపిల్లలు కలరు. లాహూరు దూరప్రదేశమని యెంచి, యతఁ డిటీవల బంగాళాలోని రంగపూరు కళాశాలలో నుపన్యాసకుఁ డయ్యెను. అచటనె మన్యపుజ్వరము సోఁకి, యతని యసువులఁ గొనిపోయెను ! ఆహా ! అకాలబాల్య మరణములు చూచిచూచి నాకనులు కాయలు కాచిపోవుచున్నవి !

ప్రస్తుతదేశపరిస్థితులను గూర్చి యాలోచించుటకు ప్రత్యేక మండలసభ యొకటి గుంటూరిలో నవంబరు 25 వ తేదీని జరిగెను.