పుట:2015.373190.Athma-Charitramu.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 528

నేను తిరిగివచ్చిన కొలఁదిదినములకే పిఠాపురవాస్తవ్యులును, సుప్రసిద్ధకవులు నగు ఉమ్రా అలేషాగారు గుంటూరను గొప్ప ప్రసంగము గావించిరి. ఆసభకు నే నధ్యక్షత వహించి, పూర్వమందు హిందూమహమ్మదీయులకు వైషమ్యము లుండినను, సోదరతుల్యులుగ నొకరి నొకరు ప్రేమించి మెలఁగవలసిన శుభసమయ మిపు డాసన్న మయ్యెనని నుడివితిని. 20 వ జనవరిని పాలపర్తి నరసింహముగారు, "బ్రాహ్మధర్మాశయముల"ను గుఱించి యుపన్యాస మిచ్చిరి. ఆ సమయమున నధ్యక్షత వహించిన నేను, హిందూ బ్రాహ్మమతములను బోల్చి, బ్రాహ్మసామాజికుల ప్రస్తుత పరిస్థితులను విమర్శించితిని. బంగాళములో బ్రాహ్మసమాజమువారు మాంసాహారవిసర్జనము చేయఁ జాలకుండి రనియు, యువకులలోఁ బలువురు నిర్మలప్రవర్తనముపట్ల నిర్లక్ష్యము వహించి రనియు, ఆంధ్రబ్రాహ్మసామాజికులును గొందఱు తమవిధులు బాగుగ గుర్తెఱుఁగకున్నా రనియును జెప్పివేసితిని. బ్రాహ్మసమాజ వార్షికోత్సవ పవిత్ర సమయమందలి నాయప్రస్తుతపుఁ బ్రసంగమునకు నరసింహముగారు నొచ్చుకొనిరి. నాకుఁ దోఁచిన నిజము పలుకుటయె ధర్మమని నే ననుకొంటిని.

"లండనునగర మనశ్శక్తి విమర్శనాసమాజము"న వెనుక నేను చిరకాలము సభ్యుఁడనుగ నుండి, వారి గ్రంథములందలి వినోదకర విషయములు గ్రహించుచుండువాఁడను. ఇపుడు నే నట్టి పుస్తక మేదైనఁ జదివి, ఆత్మోపశాంతి గాంచ నెంచి, యిటీవల లాడ్జిమహాశయుఁడు ప్రచురించిన "రెయిమండు" అను పుస్తకమును తెప్పించి చదివితిని. ఆగ్రంథకర్త కుమారుఁడు రెయిమండు గత జర్మను యుద్ధములో నాకస్మికముగఁ జనిపోయెను. కుమారుని యాత్మ తండ్రితోఁ దన వృత్తాంతము చెప్ప ననేకప్రయత్నములు చేసెనని యిటీవలఁ