పుట:2015.373190.Athma-Charitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. దుష్కార్యము 19

నొక యుపాయము చేసితిని. నాఁడు ప్రొద్దున నే నడుగఁగా మాతండ్రి పుస్తకము ఖరీదు నా కిచ్చివేసె ననియు, అది యాతని కొసంగుటకై యొక పుస్తకములో నుంచితి ననియు, అచ్యుతరామయ్య నాపుస్తకములు చిందరవందరగఁ జేసినపు డాపావులా యెక్కడనో పడిపోయె ననియును నే నంటిని ! తనమూలముననే పావులా పోవుటవలన నాతఁడె నష్టపడవలె నని నావాదము. ఈ యొక పన్నుగడమూలమున రెండుపనులు సమకూరు నని నాయాలోచన, - ప్రాఁతయప్పు తీఱిపోవుట యొకటి, పరాభవము చేసినవానిమీఁదఁ బగ సాధించుట మఱియొకటి!

మొదట నేను బరియాచకమునకె యిట్లనుచుంటినని యచ్యుతరామయ్య తలంచెను. కాని, మొగము ముడిఁచి, మాటిమాటికి పుస్తకములో పావులా యుంచితి నని చెప్పుచుండుటచేత, నామాట లాతఁడును దగ్గఱవారును నమ్మి, నాపుస్తకములు పలుమాఱు తిరుగవేసి చూచిరి. క్రిందిదుమ్ములో వెదకిరి. ఎక్కడను పావులా కానఁబడ లేదు. పావులా నే నింటియొద్దనుండి తెచ్చుటయె నిజ మైనచో, తన మూలముననే యది పోయెను గావున, తానె యానష్టము వహింతునని యచ్యుతరామయ్య చెప్పివేసెను.

ఐన నింత సులభముగ నీయుదంతము సాంతము కాలేదు. ఆప్రొద్దున మాతండ్రి నాచేతికి పావులా యిచ్చివేసె నని స్పష్టపడవలెను. కావున నచ్యుతరామయ్య నన్ను బ్రమాణము చేయు మనెను. ఒక యబద్ధ మాడువాఁడు తనమాట నిలువఁబెట్టుకొనుటకు పెక్కు లసత్యములు పలుకవలెను. నే నపు డెన్ని యొట్టులో పెట్టుకొంటిని; ఎన్ని ప్రమాణములో చేసితిని ! నాయసత్యతములు పెరుగుచుండుటకు