పుట:2015.373190.Athma-Charitramu.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. దు:ఖోపశమన ప్రయత్నములు (1) 521

కాని నా కీకాలమున గుంటూరునఁగాని, యిందలి యుద్యోగస్థానమునఁగాని కలిగిన ప్రత్యేక కష్టనష్టము లెవ్వియును లేవు.

ఇటీవలఁ గొన్నియేండ్లనుండి గుంటూరు కళాశాలాధ్యక్షులుగ నుండిన స్ట్రాకుదొరగారు స్వదేశసందర్శనార్థ మేగు సందర్భమున నాయన కొక వీడుకోలుపత్రము సమర్పింప నుపాధ్యాయులము నిశ్చయించుకొంటిమి. ఆ విజ్ఞాపనమును నన్నే సిద్ధము చేయుమని మిత్రులు కోరిరి. 13 వ జూలయిని స్ట్రాకు దంపతులకు మేము వీడుకో లొసంగితిమి. నూతనాధ్యక్షుఁడగు రూప్లేదొరగారు కొంత కఠినుఁడనుకొంటిమి. కాని, ఆయనతో నేను రెండు మూఁడుసారులు ప్రసంగింపఁగా, ఆయనయు మనసిచ్చి మాటాడి, సహాధ్యాపకులందు సానుభూతి గనఁబఱిచిరి. సేలము కళాశాల కధ్యక్షుఁడు కావలసి వచ్చె నని తెలిసి నే నాయుద్యోగమునకు దరఖాస్తు చేయఁగోరఁగా, నాయర్జీని రూప్లేదొరగారు తమ సిఫారసుతో నంపిరి. మిత్రుల యాలోచనల చొప్పున నేనంత చెన్నపురికేగి, చెన్నాప్రెగడ భానుమూర్తిగారి ద్వారా కొంత ప్రయత్నము చేసివచ్చితిని.

ఇటీవల కొన్ని నెలలనుండి బెజవాడలో నుపాధ్యాయుఁడుగ నుండిన బంగారయ్య నన్నుఁ జూచుటకు 5 వ ఆగష్టున గుంటూరు వచ్చి తన సమాచారములు తెలిపెను. లాహూరు నగరమున నాతని కిటీవల దయాళసింగు కళాశాలలో ముఖ్యాంగ్లోపన్యాసక పదవి యొసగఁబడినను అది స్వీకరింపక, ఆపురమునందె దయానంద వేద కళాశాలలో నధ్యాపకోద్యోగమును అతఁడు 250 రూపాయిల వేతనముమీఁద జేకొనెను.