పుట:2015.373190.Athma-Charitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

సాయము చేయుచుండువాఁడను. ఆమె యింట లేనపుడు నేనే మడిగట్టి, నా వచ్చియురాని వంటతో సోదరులకు భోజనము సమకూర్చుచుందును. రాజమంద్రి వెళ్లనపిమ్మట పాఠశాలలోని చదువునకు నే నెక్కువ శ్రద్ధ వహింపవలసిన కాలమందును, ఇంటఁ దల్లికిఁ దోడుపడుట నా కార్యక్రమమున నంతర్భాగ మయ్యెను. దీనికి బంధువులు సహచరులు నన్నొక్కొకమాఱు గేలి చేసినను, జననీ సేవయు సోదరపరిపోషణమును నవమానకరమని తలంపక, విద్యా నిరతికిని గృహకృత్యనిర్వహణమునకును ఆవంతయు విరోధము లేదని బాగుగ గుర్తెఱిఁగి మెలఁగితిని.

5. దుష్కార్యము.

నేను 11 వ యేటఁ జేసిన యొక దుష్కార్యమువలన నామనస్సు మెరమెరలాడు చుండును. నాలుగవతరగతి పఠనీయపుస్తకములలోని "ఆసియాభూగోళము" నాకు లేదు. ఎన్ని సారులు కొను మని వేడినను మాతండ్రి యాపుస్తకము నాకుఁ గొనిపెట్టలేదు. మాసహపాఠులలో అచ్యుతరామయ్య యనువాఁడు కారణాంతరములచేతఁ జదువు మానివేసి, నాకుఁ దనపుస్తక మమ్మఁజూపెను. దానివెల నాలుగణాలు. తరువాత డబ్బిచ్చెద ననఁగా, నా కాతఁడు పుస్తక మిచ్చివేసెను.

ఆతఁ డెన్నిసారులు తన డబ్బడిగినను, నే నేదో మిష చెప్పి తప్పించుకొనువాఁడను. ఒకనాఁడతఁడు పాఠశాలకు వచ్చి, సొమ్మీయుమని గట్టిగ నడిగి, "నా పావులా యిచ్చువఱకును నీపుస్తకము లీయ" నని చెప్పి, నాపుస్తకములబొత్తి లాగివైచెను. పుస్తకములకై మే మిద్దఱము పెనఁగులాడినప్పుడు, అవి క్రిందఁ బడిపోయెను. అందఱిలో న న్నీతఁ డవమానము చేయుటకు నేను గోపించి, వాని మీఁదఁ గసి తీర్చుకొన