పుట:2015.373190.Athma-Charitramu.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. 'అబ్బావు' మరణము 515

వాఁడు నిలుచుండుటగాని, నడచుటగాని, కనీసము సరిగాఁ గూర్చుండుటగాని లేదు; దేఁకుచుండువాఁడు. పెద్దతల, దొప్ప చెవులు, శుష్కించినదేహమును గలిగియుండువాఁడు. ఐనను, వయస్సునకుఁ దగిన తెలివితేటలు వానికి లేకపోలేదు. నాభార్యను "అమ్మా" యనియును, నన్ను "అన్నా" యనియును బిలుచుచు, పెంపుడుతల్లి మీఁద వాఁ డమితానురాగము గాంచియుండువాఁడు. నామీఁద వాని కెంతప్రేమ మున్నను, "అన్నపైయన్న !" అని పలుకుచుఁ బరియాచకమున నన్ను నిరసించుచుండువాఁడు ! తల్లిదేవుఁడు దేవు నరుఁగునందును, తనదేవుఁడు తన చిన్ని తాటియాకుల పెట్టెలోను నుండెనుగాని, అన్నకుమాత్రము దేవుఁ డెచటను లేఁడని యాకుఱ్ఱఁడు పలికి నన్నుఁ బరిహసించువాఁడు.

ఈయర్భకునికి మేము పేరైనఁబెట్టలేదు. ఏమి పేరుపెట్టము ? ఏమని పేరు పెట్టము ? పుట్టిననాఁడే కన్నతల్లిని గోలుపోయిన దురదృష్టునకు ముద్దులు ముచ్చటలు నెట్లు జరుగును ? బారసాలలు, పండుగులు నెట్లు కొనసాగును? వీనిని తల్లి పేరుతోనే పిలువుఁడని మా తమ్ముఁడు వెంకటరామయ్య చెప్పుచుండువాఁడు. బాలకుఁ డింట నాడుకొనుచుండునపుడు, ఏవో ముద్దుపేళ్లుపెట్టి తల్లియు నేనును వానిని బిలుచుచుండువారము. కాని, యెప్పటికప్పుడు బ్రదుకె యస్థిరముగఁ గానఁబడెడివానికి నేపేరు పెట్టుటకును మాకు మనసొప్పకుండెను. వీనిపేరేమి యని మమ్మెవరైన నడిగినపుడు, పెద్దవాఁడై వానిపేరు వాఁడె పెట్టుకొనునని మే మనుచుండువారము. మాటలు వచ్చినపిదప, చెలికాండ్రతో మాటాడుచు, వీఁడు తనపేరు "అబ్బావు" అని చెప్పుకొనుచుండువాఁడు ! ఆ పేరుతోనే తోడిపసివారలు వానిని సంబోధించుచుండువారు. తన కెందఱు పిల్లలని యెవరైన నడిగి