పుట:2015.373190.Athma-Charitramu.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 514

కొని, మేము భీమవరము వెళ్లితిమి. అచట నరసింహమున కుపనయనము జరిగెను. మా రెండవతమ్మునిఁ జూచుట కంతట నేను నరసాపురము పోయితిమి. గన్నవరమున నుండు మారెండవ మఱఁదలి కుమారుఁడు రామచంద్రరావున కంతట పెండ్లి యగు నని తెలిసి, మే మచటి కేగి, పెండ్లివారితో ర్యాలి తరలి వెళ్లితిమి. పెండ్లిలో మా పిల్ల వానికి మరల జబ్బుచేసెను. అదివఱకు తోడిపిల్లలతోఁ గూడి యాడుకొనుచుండు మాపసివాఁ డంతట మంచ మెక్కెను. వానికి జ్వరము వచ్చి యొడ లుబ్బి, శ్వాస పుట్టెను. పెండ్లియైన తోడనే మేము గన్నవరము మరలి వచ్చితిమి. జూను రెండవతేదీ సాయంకాలమున పిల్లవాఁడు కనులు తేలవైచెను. అరగంటలో వాని ప్రాణము లెగిరిపోయెను.

మా దంపతుల కిరువురకును మితిలేని దు:ఖము సంప్రాప్తమయ్యెను. లోక మంధకార బంధుర మయ్యెను. సంతానప్రాప్తి లేకున్నను మనసు నెటులో సరిపెట్టుకొని దినములు గడపుమాకు, దైవమీ పిల్లవాఁడను నెరను జూపించి, లేనిపోని యాసలు గలిపించి, యీ బాలకుని గుఱించి శ్రమపడునట్లు చేసి, తుదకు బాల్యముననె వాని యసువులఁ గొనిపోయి, మమ్మీదు:ఖవార్ధినిఁ బడఁద్రోచె నని మేము వగచితిమి. తీఱని విచారమునకు నేను లోనయితిని. అనుంగు చెల్లెలినేగాక యామె సంతతి నంతనుగూడ నంత మందించినవిధి నాధుని విపరీతపుఁ జేఁతలకు నేను వెత నొందితిని. లోకమున నావంటి దురదృష్టవంతులు లేరనుట స్పష్టము.

ఆరోజులలో రేయింబవళ్లు పిల్లవానినిగుఱించియె నేను దలపోయుచుండువాఁడను. ఐదవసంవత్సరము జరుగుచుండు నీ యర్భకునికి ఆజన్మరోగకారణమున తగిన శరీరదార్ఢ్యము గలుగనేలేదు !