పుట:2015.373190.Athma-Charitramu.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 512

1916 మార్చి నెలలో అరండలు పేట మునిసిపలు ఎన్నికలలో వెంకటప్పయ్యగారిని అభ్యర్థిగ నిలువుఁడని మిత్రులు కోరఁగా, వారు సమ్మతించిరి. ఆ యుద్యోగ మాయనకు లభించుటకై మిత్రులము పనిచేసితిమి. మార్చి తుదిని జరిగిన యెన్నికలలో వెంకటప్పయ్యగారు సభ్యులైరి.

ఏప్రిలు నెల 2 వ తేదీని "యువజన సాహితీసంఘము" వారి యాజమాన్యమున పురపాఠశాలలో నొక బహిరంగసభ జరిగెను. అపుడె బారిష్టరు పరీక్షనిచ్చి స్వదేశము తిరిగివచ్చిన శ్రీఉన్నవ లక్ష్మీనారాయణగారు సభ కగ్రాసనాధిపులు. నేను "బంగాళా వారి యాచారములను" గుఱించి యాంధ్రమున నొక యుపన్యాస మిచ్చితిని. ఆంధ్రులకును బంగాళీయులకును గల తారతమ్యములు హాస్యరసయుక్తముగ నే నిట్లు వర్ణించి చెప్పితిని : - తెలుఁగువారల రుచులలో పులుసు కారములు ప్రధానములు. బంగాళావారికి తీపి ప్రియము. ఆంధ్రుఁ డనుదినము తిను మిరెపుకాయలు చింతపండును బంగాళీయునికి మాసమునకైన నక్కఱలేదు! వారు నేయి వేసికొనరు. అగ్రవర్ణములవారును మత్స్యభుక్కులె. నే నొకసారి కొందఱు తెలుఁగునేస్తులతోఁగలసి యొక బంగాళావారియింట విందు గుడిచితిని. అందఱు ముగించునప్పటికైన నా భోజనప్రారంభము కాలేదు. విస్తరిలో నుండు వస్తువు లెవ్వియు నా నోటికిఁ బోకుండెను. మనకు వెలగపండు ప్రియము, బంగాళీయులకు మారెడిపండు. వారికిఁ బ్రీతి వేఁప, మనకు కఱివేఁప. గుమ్మడికాయ మనము వండుకొందుము, వారు దాని తీగకూర చేసికొందురు. శుక్లపక్షముతో తెలుఁగు వారికిని, కృష్ణపక్షముతో బంగాళీయులకును మాసారంభమగుచున్నది. మనపాఠశాలలలో నున్నత మగు తరగతి యాఱవది; వారి దేశమున పెద్దది మొదటి