పుట:2015.373190.Athma-Charitramu.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. సభలు, సమావేశములు 511

మించిరి. ఆగృహములను దమవశముచేసినచో, తమసంఘమువారు వానియందు ఆదర్శప్రాయమగు నొక స్త్రీపాఠశాల నెలకొల్పెదరని టెన్నెంటుకన్యయు, ఆమె యేర్పఱిచిన "హిందూవివాహ సంస్కరణసంఘము" వారును అభిప్రాయపడిరి. ఇది నాకు రుచింపలేదు. వెంకటప్పయ్యగారు నాతో నేకీభవించిరి. ఆగృహములందొక యువతీ గురుకులము స్థాపించి జరుపుభారము వెంకటప్పయ్యగారె వహించుట కర్తవ్యమని మిత్రు లభిప్రాయపడిరి.

బెజవాడ ప్రార్థనసమాజమువారికిఁ గొంతస్థలము నీయుఁడని "రామమోహనపుస్తకాగార" స్థాపకులలో నొకరును, బెజవాడలో నాపూర్వశిష్యులునగు పాటిబండ సుబ్రహ్మణ్యముగా రా భాండాగారసమాజమువారి నడిగిరి. ప్రార్థనసమాజోపయోగార్థమై కొంత స్థలము ప్రత్యేకించుట న్యాయమని నేనును జెప్పితిని. అంతఁ గొంత స్థలము ప్రార్థనసమాజమున కొసఁగఁబడెను. దీనినిగుఱించి ధర్మకర్త సుబ్రహ్మణ్యముగారు దస్తావేజు వ్రాసియిచ్చిరి.

ఇపుడు "గుంటూరు ప్రార్థనసమాజము"నకు గూడ నొకమందిర మేర్పాటుచేయుటకై నాప్రోత్సాహమునఁ బ్రయత్నములు సాగెను. మద్ది రాధాకృష్ణయ్యగారు కొంత విరాళ మొసంగెద మనిరి. నేనును పెద్ద మొత్తమీయనెంచితిని. గతవత్సరమున కలకత్తాలో సాధారణ బ్రాహ్మసమాజసాధనాశ్రమమున సకుటుంబముగ నివసించి మత విద్య నేర్చిన గుంటూరుమండల వాస్తవ్యులు పాలపర్తి నరసింహముగా రిపుడు గుంటూరు తిరిగి వచ్చిరి. వారిని గుంటూరు ప్రార్థనసమాజ ప్రచారకునిగ నియమించి, వారిపోషణమునకుఁ జందాలు వేసికొని కొంత గౌరవవేతన మీయ మేమేర్పాటు చేసితిమి.