పుట:2015.373190.Athma-Charitramu.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. సభలు, సమావేశములు 509

యాందోళన మందితిని. నెమ్మది పడుచుండె నని తెలియుటచేతఁ గొంత యూరడిల్లి, యెటులో పరీక్షకుఁ బోయితిని. పరీక్షానంతరమున నేను సరాసరిని గుంటూరున కేతెంచిన కొన్ని దినములకు, పిల్ల వానిని దీసికొని నాభార్య వచ్చెను. వాండ్రను గలసికొనుటకు నేను రెయిలునొద్దకుఁ బోయి, పెట్టెలోని కెక్కి చూడఁగా, పిల్లవాఁడు నన్నానవాలుపట్టి, "నీవు అన్నవు. నాతో చెప్పకుండా తాతత్తా (కలకత్తా) వెళ్లిపోయావా ? అని నామీఁద నిష్ఠురపడెను ! పోల్చలేనిరీతిని బలహీనుఁ డయ్యెను. వెలిచేరులో నుండునపుడు, వానికి మరల దేహము పొంగి జ్వరమువచ్చెను. అప్పటినుండియు వానికప్పుడప్పుడు ఉష్ణము తగులుచుండుటవలన, మధ్యఁ గలిగెడికొంచెము సత్తువయుఁ బోవుచుండెడిది ! అతని బ్రదుకంతయు వ్యాధితోడి పెద్ద పోరాటమె !

సెప్టెంబరు నెలలో నాపరీక్షాఫలితము తెలిసెను. నేను కృతార్థుఁడ నైతి నని మిత్రులు తంతు లంపిరి. స్నేహితులు బంగారయ్య సత్యనారాయణగార్లును జయమందిరి. బంగారయ్య యమ్. యె. పరీక్షలో కలకత్తా విశ్వవిద్యాలయమున నాంగ్లమున మొదటితరగతిలో మొదటివాఁడుగ నుత్తీర్ణుఁ డయ్యె నని విని సంతోషించితిని. సత్యనారాయణయు నేనును మూఁడవతరగతిలో జయమందితిమి. ఆ తరగతిలో నాకు లభించినస్థాన మధికమైనదియె. వయసు మీఱిన పిదప, దూరదేశముపోయి, వ్యయప్రయాసలకు లోనై, తుదకు పరాజయ మందిన యపకీర్తిపాలుగాక, ఏదోరీతిని గెలుపొందుటకె నేను సంతోషించితిని ! నా నూటయేఁబది రూపాయిల లోపుజీత మిపు డొక్కమాఱుగ రెండువంద లగుటయెకాక, సంవత్సరమునకుఁ బది రూపాయిల వృద్ధితో దాని పరిమితి మున్నూఱు రూపాయిలని