పుట:2015.373190.Athma-Charitramu.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 508

యాచారములందు బ్రాహ్మసమాజమువా రేతిన్నని త్రోవత్రొక్కి, దేశోద్ధరణమునకుఁ దోడుపడిరి? పూర్వమందు బౌద్ధమతమువలె ప్రస్తుతమున బ్రాహ్మమతము జంతుహింసనరికట్టనేల ప్రయత్నింప రాదు?

నేను కలకత్తా కాలేజివీధి చౌకునందు షికారుచేయునప్పుడు, నాకు, బరిచితులగు బ్రాహ్మసమాజమిత్రులు గొందఱు సామాన్యముగ నగపడుచుండువారు. వీరిలో "అభినవపత్రికా" ధిపతులగు రామానంద చాటర్జీగారొకరు. వీరు మద్రాసు స్టాండర్డుపత్రిక చదువుచుండువారు కావున, అందలి "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" అను వ్యాసములు వ్రాయువా రెవరో తెలియునా యని యపుడపుడు నన్నడుగుచువచ్చిరి. ఉపవిలేఖకుల గుట్టు బయలు పెట్టుట వట్టి యలౌకికకృత్యము గాన, నిజము చెప్పుటకును, అనృతమాడుటకును వలనుపడక, నేను, "ఆరచయిత మోముచూడ నాకును గుతూహలమె" అని పలికి, తప్పించుకొనువాఁడను. ఈ మద్రాసురచయిత, బంగాళాజనుల సమాచారములు బాగుగఁదెలియక, వైరభావమున వారల నెగతాళి చేయుచుండెనని చాటర్జీగా రనుచుండువారు. "బ్రాహ్మసమాజము"ను గూర్చిన నా మొదటి వ్యాసములు చదివిన యాయన యొకనాఁడు, "ఈవ్రాఁతకాఁడు తప్పక బ్రాహ్మసామాజుకుఁడె !" యని నాతోఁ జెప్పినను, అందునుగూర్చిన తక్కిన వ్యాసములు చదివి, "ఈ సాహసికుఁడు బ్రాహ్మాసమాజములోఁగూడ నెరసులు వెదకుచున్నాఁడె !" అని మొఱపెట్టెను !

15. సభలు, సమావేశములు.

నేను కలకత్తాలో నిటీవల పరీక్షకుఁ జదువుచుండునపుడు, మా పిల్లవానికి వెలిచేరులో జబ్బు చేసె నని నాకు జాబు వచ్చి, మిక్కిలి