పుట:2015.373190.Athma-Charitramu.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. కలకత్తా ప్రయాణము 497

ళించినపిదప గుంటూరు వచ్చితిమి. డాక్టరు కుగ్లరు పిల్లవానికి మందిచ్చి వ్యాధినివారణఁ జేసి, నేను కలకత్తాప్రయాణము విరమింప నక్కఱ లేదని చెప్పెను. కళాశాలలో నాకు రెండు సంవత్సరములు జీతము ముట్టనిపద్ధతిని సెలవిచ్చిరి. మా తమ్ముఁడు వెంకటరామయ్య నా చదువునకుఁ గావలసిన సొమ్ము ఒసఁగెద ననెను. అందువలన 1913 జూను 20 వ తేదీని నేను కలకత్తా వెడలిపోయితిని. భార్యయు, పిల్లవాఁడును మాబావమఱఁది యుద్యోగస్థలమగు పామఱ్ఱు వెడలిపోయిరి.

నేను కలకత్తా చేరునప్పటికి నా పూర్వశిష్యులు బంగారయ్య సత్యనారాయణగార్లు, హారిసను రోడ్డున నుండు నొక మేడగది పుచ్చుకొని, నన్నచటి కాహ్వానించిరి. మేము మువ్వుర మా గదిలో నివసించితిమి. ఆ మేడభాగమున తక్కిన గదులలోఁగూడ నాంధ్ర యువకులె యుండిరి. వీరందఱును ఒక యోడ్రబ్రాహ్మణునిచే మేడమీఁద వంట చేయించుకొని భుజించువారు. వీరిలో పెక్కండ్రు నా పూర్వశిష్యులె. వీ రందఱు నా కిపుడు సహవాసులైరి. నేను దొరతనమువారి రాజధానీ కళాశాలలోఁ జేరితిని. మా తరగతిలో నలువదిమంది విద్యార్థులు గలరు. వీరందఱిలో వయసున నేనె పెద్దవాఁడను.

ఇరువదియేండ్లు ఉపాధ్యాయునిగ నుండి నలువదియేండ్లు దాఁటిన నేను, పరదేశమున మరల పుస్తకములు చేతఁబట్టి, నాకంటెఁ జిన్న వార లగు గురువులయొద్ద శుశ్రూష చేయుటకై యనుదినమును విద్యాశాలకుఁ బోయి వచ్చుచుండుట మొదట కడు దుస్సహముగ నుండెను. దీనికిఁ దోడు మా భోజనశాలలోని భోజనము నాకంతగ సరిపడలేదు. గోదావరిమండలమున మాఱుమూల నుండు నొక