పుట:2015.373190.Athma-Charitramu.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 496

కొని బందరువచ్చిన రామకృష్ణారావుగారిని నేను గలసికొని మాటాడఁగా, కలకత్తాలోఁ జదువుమని నన్ను వారు ప్రోత్సహించిరి.

కాని, నిరతము వ్యాధిగ్రస్తుఁ డగు మాయర్భకుని, నా భార్యను గుంటూరులో విడిచివైచి నే నెట్లు దూరదేశము పోయి చదువు సాగింపఁగలను ? ఈ రెండు వత్సరములును కలకత్తాలో నుండి చదువుకొనుటకు వలసిన సొమ్మెట్లు నాకు సమకూరును ? ఈ సమస్యలు నే నిపుడు పరిష్కరించుకొనవలెను. భార్యను పిల్లవానిని నాతో కలకత్తా యేల గొనిపోఁ గూడ దని నే నంత నాలోచించితిని. అందువలన నచట నాకు వ్యయ మధికమగుట స్పష్టమె కాని, లేనిచో నాకు భోజనసౌకర్యము గలిగి పిల్ల వానిని గూర్చిన యాందోళనము తొలఁగదు గదా ! బంగాళాదేశము ఆయుర్వేదవైద్యశాస్త్రజ్ఞుల కాటపట్టు. వారి సాయమున పిల్లవాఁడు పరిపూర్ణారోగ్యవంతుఁడు కావచ్చును. ఈ కళాశాలాధికారులు నా చదువునకుఁ గొంత సొమ్మిచ్చెదమని చెప్పిరి. కావుననేను కలకత్తాప్రయాణమున కాయితపడితిని. పూర్వము విజయనగరమున నా శిష్యుఁడై, ఇపుడు తర్కమునందు యమ్. ఏ. పరీక్షలో జయమందిన శ్రీజయంతి సత్యనారాయణమూర్తిగారు నాకు బదులుగ నీ కళాశాలలో నీ రెండు సంవత్సరములు పనిచేయ సమ్మతించిరి.

1913 వేసంగిని, కుటుంబసహితముగ నరసాపురము పోయి, అచట మా తమ్ముఁడు కృష్ణమూర్తియింట నివసించితిని. అచట నుండునపుడు పిల్లవాఁడు బాగుగనే యుండెను. కాని, యచటనుండి బయలుదేఱు సమయమున వానికి వ్యాధి యారంభముకాఁగా మార్గమందలి ధవళేశ్వరమున మా తోడియల్లుఁడు పోడూరి కృష్ణమూర్తిగారి యింటఁ గొన్ని దినములు నివసించి, పిల్లవానికిఁ గొంచెము నిమ్మ