పుట:2015.373190.Athma-Charitramu.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 488

కొనిరి. గుంటూరునుండి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు నాతో నరసాపురము విచ్చేసిరి. జబ్బుగా నుండుటచేత కొండ వేంకటప్పయ్యగారు రాలేకపోయిరి. నే నాసమయమున నిచ్చిన యుపన్యాసము నందు, సంఘసంస్కరణములను గుఱించి మన దేశీయులకుఁ గల విపరీతాభిప్రాయములు ముందుగ విమర్శించితిని: జుట్టును బొట్టును లేక యుండుటయు, అనాచారవంతు లగుటయు, ప్రాచీనసదాచారములను నిరసించుటయు సంఘసంస్కారిధర్మము లని కొందఱు భ్రమపడుచున్నారు ! ఏ సాంఘికాచారప్రభావమున సంఘమునందు నయసంపదయు, నభ్యున్నతియు భంగ మొందెనో, ఏయాచారముల ననుసరించి హిందువులు నాగరికతయందు వెనుకఁబడిరో, అట్టిపద్ధతులను ఆచారములనే మనము సంస్కరింపవలెను. సంస్కరించుట యనఁగా బాగుపఱచుటయే కాని పాడుచేయుట గాదు. మన దేశమున కిపుడు కావలసిన సంస్కరణములు ముఖ్యముగ విద్యావిషయకములు, వివాహవిషయకములును. జను లందఱును వ్రాయను జదువను నేర్చినఁగాని, ఏ దేశమునకును నిజమగుమేలు గలుగనేరదు. వివాహ సంస్కరణములలో, ముందుగ నతిబాల్యవివాహములు నిషేధించి, యుక్తవయస్సు వచ్చిన యువతీయువకులకే వివాహములు జరుపవలె ననియు, దురాచారభూయిష్ఠ మని హిందూ సంఘమును విసర్జించి యన్యమతస్వీకారము చేయుట దేశభక్తుల ధర్మము గాదనియును, - నేను జెప్పితిని.

ఈ యేప్రిలుమాసాంతమున మాయమ్మమ్మ వేలివెన్నులో ననాయాసమరణ మందెను. చనిపోవునప్పటి కామెకు సుమారు 90 సంవత్సరముల వయస్సు. చిరకాలజీవియగు నీ పుణ్యవతి తుదిదినముల వఱకును ఆరోగ్యభాగ్య మనుభవించెను. చివర రెండుమూఁడేండ్లు