పుట:2015.373190.Athma-Charitramu.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 480

నాయీ "చేటభారతము"నకు నాయఁడుగారినుండి ప్రత్యుత్తరమురాలేదు. నాకిపుడు గుంటూరు కళాశాలలో హాయిగనుండినను, రాజమంద్రిలో బ్రాహ్మసమాజ సంస్థలోఁ బనిచేయ నామనస్సు ఉఱ్ఱూతలూఁగు చుండెను. కాని, రాజమంద్రి కేగిన ప్రతిష్ఠాభంగమగునని యొకమూలభయము ! సిగ్గుకోరికల మధ్యనూఁగులాడుచుండు నేనెటులూరకుందును? కావున, నాయఁడుగారికి 9 - 12 - 08 తేదీని నేనింకొక లేఖవ్రాసితిని. దీనికిని వారియొద్దనుండిగాని, వీరేశలింగము పంతులుగారి యొద్దనుండిగాని నాకు జాబురానేలేదు ! ఆపాఠశాలకు వేఱొకప్రథానోపాధ్యాయుఁడు నియమింపఁబడెనని నా కంత దెలి సెను.

ఇది జరిగిన కొన్ని నెలలకు నేను వీరేశలింగముగారిని గలసి కొనినపుడు, ఈసంగతిని గుఱించి ప్రస్తావనరాఁగా, ఆస్తిక పాఠశాలలో నుద్యోగముచేయ నాకిష్టములేనట్లు నాయఁడుగారు తమకుఁ జెప్పివేసిరనియు, అందుచేతనే తాము మఱియొకరిని నియమించితి మనియును వారనిరి. తమతోఁగలసి యేదేనిధర్మ సంస్థలో నిపుడు పనిచేయఁ దలంచుకొంటినని నేను వ్రాసినయుత్తరమున కాయన, 9 - 1 - 09 తేదీని ప్రత్యుత్తరమిచ్చుచు, జరిగినది మఱచిపోయి రానున్న దానిని గుఱించి యోజింపుమనియు, నేనుగూడ రాజమంద్రి వచ్చివేసినచో నేదోయుద్యోగమునఁ బ్రవేశింపవచ్చుననియును వారు వ్రాసిరి.

ఇది జరిగిన మఱుసటిసంవత్సరమున నాయఁడుగారియొద్దనుండి నా కొకజాబు వచ్చెను. దాని నిందుఁ బొందుపఱుచుచున్నాను : -