పుట:2015.373190.Athma-Charitramu.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. వెంకటరత్నమునాయఁడుగారు 477

తరలి రమ్మని ప్రోత్సహించుచు వచ్చిరి. నారాకశ్రేయోదాయకమని నాయఁడు గా రెంచినచో, ఆయనయే దానిని గుఱించి ప్రశంసింతురని నేను సమాధానమిచ్చి యూరకుండువాఁడను. ఇటు లుండఁగా, విజయనగరనివాసమునందు నా కంతకంతకు విసుగుపుట్టి, ఆరోగ్య ప్రదమగు గోదావరీమండలప్రాంతములకు రాఁగోరితిని. కనాస మే యున్నత పాఠశాలలోనైన ప్రథమోపాధ్యాయపదవిని స్వీకరించుటకు సంసిద్ధముగ నుంటిని. ఇటులుండఁగా, తమ పాఠశాలలో ప్రథమోపాధ్యాయునిపని ఖాళి యయ్యెననియు, దానిని గుఱించి నాతో మాటాడెదమనియు నాయఁడుగారు 1907 ఫిబ్రవరి 7 వ తేదీని నా లేఖకుఁ బ్రత్యుత్తరము వ్రాసిరి. వారు కోరినట్లు నేను వచ్చి మాటాడితిని. కాని, వారిసంభాషణధోరణిని బట్టి నా కా యుద్యోగ మీయ వారి కిష్టము లేనట్లు గ్రహించితిని. మఱుసటి సంవత్సరారంభమున నేను గుంటూరు కళాశాలకు వచ్చివేసితిని.

ఇటీవల వీరేశలింగముపంతులుగారు రాజమంద్రిలో "హితకారిణీ పాఠశాలను"ను నెలకొల్పి, దాని నభివృద్ధిపఱిచిరి. ఇపుడా యాస్తిక పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు గావలసివచ్చెను. పూర్వమున, ఆస్తిక పాఠశాలా స్థాపనమునుగూర్చి వీరేశలింగము గారును, శిష్యులమగు మేమును ఎంతో యాత్రపడితిమి. కాని, పరిస్థితుల వైపరీత్యమువలన నాకాలమం దాసంస్థ యేర్పడలేదు. ఇపుడు పంతులుగారిచే స్థాపితమైన విద్యాశాల దినదినాభివృద్ధి నొందుట విని మిగుల సంతసించితిని.

1908 నవంబరులో నీ పాఠశాలవిషయమై నాయఁడుగారి యొద్దనుండి నా కొక జాబు వచ్చెను. అం దిటు లుండెను: -