పుట:2015.373190.Athma-Charitramu.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 476

వచ్చును. వారికిఁ బ్రియరచయితలగు కార్లయిలు, ఇమర్సను మార్టినోల గ్రంథములు నాకును మంచి ప్రబోధము గావించెను. నాయఁడుగారిని గురువుగఁ బూజించి, సోదరునిగఁ బ్రేమించితిని. ఆదినములలో పలుమాఱు వారితో, "బెజవాడ, బందరు రాజమంద్రీలకు మధ్యగా నున్నది సుమండీ!" యనుచుండు నామాటల కర్థము, నా యభిప్రాయములు నభిరుచులును వీరేశలింగము వెంకటరత్నమునాయఁడుగార్ల మనస్తత్త్వములకు మధ్యస్థముగను, సమన్వయప్రాయముగను నుండుననియే ! కాకినాడ కళాశాలాధ్యక్షపదవి ఖాళి యైనప్పుడు, ఆపనికి నాయఁడుగారిని దరఖాస్తు చేయుఁడని ముందుగ నేనె కోరితిని. ఆకళాశాలాపాలక సంఘమువారు వెనుకటి యధ్యక్షుని కన్యాయము చేయుటవలన, తా మాపనికిఁ బ్రయత్నింప నొల్లమని నాయఁడుగారు ప్రత్యుత్తర మీయఁగా, నేను వారితో వాదించి, దరఖాస్తు చేయునట్లు వారి నొడంబఱిచితిని. అంతట రాజమంద్రిలో నున్న వీరేశలింగము పంతులుగారికి వ్రాసి, వారు కాకినాడపోయి, కళాశాలాధికారులతో నాయఁడుగారిని గుఱించి చెప్పుఁడని వారిని వేఁడితిని. నే నాదినములలో విజయనగరమందలి కళాశాలలో నుంటిని. నాయఁడుగారికి కాకినాడ యుద్యోగమగుటకై గట్టి ప్రయత్నములు చేయుఁ డని యచటి మిత్రులకును వ్రాసితిని. అచటి విద్యాధికులలో పెక్కండ్రకు, పోటీదారులగు వి. యస్. శ్రీనివాసశాస్త్రిగారియెడఁ గాక, నాయఁడుగారియందె యభిమానము గలదు. ఎట్టకేలకు నాయఁడుగారి కీయుద్యోగమైన దని విని, నేనత్యానందభరితుఁడ నైతిని.

నాయఁడుగారు కాకినాడకు వచ్చినప్పటినుండియు, అచటి మాయుభయుల మిత్రులును నన్ను విజయనగరమునుండి కాకినాడకు