పుట:2015.373190.Athma-Charitramu.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 474

సంఘము"గ నేర్పఱిచిరి. ఈసభాకార్యక్రమమును క్రమముగ జరిపించు భారమును పురపాఠశాలాధికారియగు ఏకా రామయ్యగారిమీఁదను, నామీఁదను వేసిరి. శ్రీ పతి శ్రీనివాసరావుగారు సభకధ్యక్షులైరి. ఆంధ్రమండలములనుండి విద్యార్థి ప్రతినిధులు పలువురు విచ్చేసిరి. వక్తలలో ప్రముఖులు బందరు వంగవోలు కళాశాలాధ్యక్షులు. సభ జయప్రదముగ జరిగెను.

1903 - 4 సంవత్సరములకే మా కుటుంబ పూర్వఋణము లన్నియుఁ దీఱిపోయెను. అంతటినుండియు మువ్వురు సోదరులమును సంపాదించిన ధనమును గొంత నిలువచేసికొనుచు వచ్చితిమి. 1908 వ సంవత్సరారంభమున మాత లోకాంతరగతయైన పిదప, సోదరుల మిఁక వేఱుపడుట యావశ్యకమని నేను మాతమ్ములతో గట్టిగఁ జెప్పితిని. జననీజనకులు కీర్తిశేషులగుటయె సమష్టికుటుంబ సూత్రమునకు విచ్ఛేదము గలుగుటగదా! ఇపుడు సోదరుల మెవరికుటుంబ పోషణము వారలము చేసికొనుచున్నారము. వారివారి యగత్యములను బట్టియు, ప్రజ్ఞానైపుణ్యములను బట్టియు ధననిక్షేపణ కార్యము జరుగఁగలదు. ఎల్ల కాలమును సోదరు లందఱును గలసియుందు మను కొనుట వెఱ్ఱిపని. దీనివలన నన్నదమ్ములలో నైకమత్యమునకు మాఱుగా ద్వేషభావ మేర్పడవచ్చును. కావున ముందును సోదరు లందఱమును సమరసభావమున మెలఁగఁగోరితిమేని, యీసమయముననే విడిపోవుట యుక్తమని నేను నొక్కి చెప్పితిని. అప్పటికప్పుడే తమ్ముఁడు వెంకటరామయ్య సుమారైదు వేల రూపాయిల విలువ గల స్థిరాస్తిని సంపాదించెను. ఇంకఁగొంతకాలము గలసియుండి, ఆస్తి నింకను బెంపొందించిన పిమ్మట, వేఱుపడుట యుక్తమని యాతని యభిప్రాయము. కాని, యిది యిఁకఁ బొసఁగదని నేను జెప్పి, కాల