పుట:2015.373190.Athma-Charitramu.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. జననీ సంస్మరణము 471

యొద్దలేవు. మితభాషిణియగు మాతల్లి భావవిస్ఫురణ చేయనొల్లని స్వభావము గలది. చిన్ననాఁడు రాజమంద్రిలో నేను నాపెద్ద తమ్ముఁడును ఆమెశిక్షణ మనుభవించినవారమె. ఆమెమాట జవదాఁటఁగూడనది. ఆమెగృహపరిపాలనము భయంకరము గాకున్ననుఁ క్రమశిక్షణముతోఁ గూడుకొనినదియె. ఆమెబుజ్జగింపులు నధికాగ్రహ, మును గూడ మే మెఱుంగము. మాచిన్న నాఁ డామెయాజ్ఞల కింత కాఠిన్య ముండుటకుఁ గారణము, మాతండ్రి యింటిపట్టున నుండక, గృహయాజమాన్య మామెమీఁదఁ బడుటయె. మొదట నిటులుండినను, పిల్ల లెక్కువయైన కొలఁది, మాతల్లికాఠిన్యము సడలెను. ఆమె బలహీన. ఒక్కతెయె యింటిపనులన్నియు నెరవేర్చుకొనవలసివచ్చెను. పిల్లలము మేమామెకుఁ గొంత దోడ్పడుచుండువారము. కాని, గృహకృత్యభారమును, పసివారలతోడి బాధలును, ఆమె మనస్సును మిగులఁ గలఁత నొందించెను. సమష్టికుటుంబమునకు స్వతస్సిద్ధమగు గృహచ్ఛిద్రములు, తరువాతకాలమునందు సంసారమందలి యైక్యమునకు భంగము గలిగించెను. దీర్ఘవ్యాధియు మాతల్లి మనోవ్యాకులతను హెచ్చించెను. ఇంట నిటీవల సంభవించిన మరణములు కూడ దీనికిఁ గారణభూతమయ్యెను.

ఏది యెటు లుండినను, మాజనని స్వభావ సిద్ధగుణములు శాంతత, ఓరిమి, మితభాషిత్వమును. దైవభక్తియందువలెనే ప్రేమ విషయమునందును, ఆమానిని ప్రశాంత గాంభీర్యములతో నొప్పెడిది. విశాలమగు గోదావరీనదీప్రవాహమువలె నామెప్రేమగుణము గంభీరముగనుండి, కుంటువడని గమనమున సాగిపోవు చుండెడిది. మాజనని ప్రేమము, ఆవిశ్వజననిప్రేమమువలెనే సమత్వ సర్వాంతర్యామిత్వములతో మాకుఁ బ్రసరించెడిది. పిల్లలమగు మాశ్రేయస్సుకొఱకును,