పుట:2015.373190.Athma-Charitramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. రేలంగి 13

మా తాతగారు వేలివెన్నులో నివాస మేర్పఱచుకొని, క్రోశ దూరమందలి సత్యవాఁడ కనుదినమును కరిణీకఁపుఁ బనులమీఁదఁ బోవుచుండెడివారు. ఆయనకు చాప లల్లుట, విసనకఱ్ఱలు కట్టుట మొదలగు చిన్న పనులయం దాసక్తి. ఈ పనులు నెరవేర్చుచు, ఆయన నాకును మా పిన్నికిని పద్యపాఠములు చెప్పుచుండువాఁడు. పసివాఁ డగు మా తమ్ముఁడు వెంకటరామయ్యకును ఆయన దాశరధీశతకములోని పద్యములు నేర్పెను. ఇట్టి ప్రియబాంధవుని వియోగము మాకు కడు దుస్సహముగ నుండెను.

4. రేలంగి

నా యెనిమిదవయేట అనఁగా 1878 వ సంవత్సరమున, మా తండ్రి యుద్యోగము చాలించుకొని స్వస్థలమగు రేలంగి చేరెను. రేలంగి రెండేండ్లక్రితమువఱకును మేము నివసించిన గ్రామమైనను, ఇపు డది నాకన్నులకుఁ గ్రొత్తగ గానిపించెను. అచట మాపెద్ద పెత్తండ్రి గంగన్న గారిపుత్రికలు, పుత్రుఁడు వీరభద్రుఁడును నా కిపుడు సావాసు లైరి. వీరిలో పెద్దది యగు రత్నమ్మ నాకంటె పదియేండ్లు పెద్దదియై, తాను నేర్చిన "లంకాయాగము" రాత్రిపూట శ్రావ్యముగఁ బాడి, నా కానందము గలిపించుచుండును. నా కీరీతిని రామాయణ కథ విపులముగఁ దెలిసి, నా మనోవీథిని గొప్పయాశయములు పొడమెను. రెండవది యగు చిట్టెమ్మ నాకంటె కొంచెము పెద్దది యై, గ్రామమందలి మాయీడు బాలబాలికలతోడి యాటపాటలకు నన్నుఁ గొనిపోవుచు వచ్చెడిది. వీరభద్రుఁడు నా పెద్దతమ్మునికంటె కొంచెము పెద్దవాఁడై, వాని కీడుజోడై యుండెను.