పుట:2015.373190.Athma-Charitramu.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. గుంటూరునందలి యుద్యోగము 463

కళాశాలలో పని నాకు బాగుగనుండినను, పట్టణనివాసమె నా కంతకంతకు దుస్సహమయ్యెను. వేసవికాలము సమీపించిన కొలఁది, నీటియెద్దడియు, దోమలబాధయు నధిక మగుచుండెను. ఈబాధ లెపుడు తీఱునా యని నేను వేచియుంటిని. నరసాపురమునను, పిఠాపురమునను పాఠశాలలలో ప్రథమోపాధ్యాయపదవి ఖాళీపడిన దని తెలిసి, నేను దానికై ప్రయత్నింపవలె నని యెంచితిని. ప్రథమతరగతి కళాశాల విడిచి మరల పాఠశాల కేగుట, స్వర్గలోకసుఖములు విడనాడి, భూలోకనివాసమునకు దిగుటవలె నుండును. కాని, యీదూరప్రదేశమందలి కష్టముల కోర్చి గొప్పపదవి ననుభవించుట కంటె, స్వదేశమున సామాన్యస్థితినుండి సౌఖ్యమందుట మంచిదికదా. పిఠాపురము సంగతి యడుగఁగా, వెంకటరత్నమునాఁయడుగారు తమ కళాశాల కంటియుండు పాఠశాలలో ప్రథమోపాధ్యాయపదవిని గుఱించి మాటాడెదను రమ్మని నాకు వ్రాసిరి. నే నంత కాకినాడ పోయితిని. మాబావమఱఁది సకుటుంబముగ నచట నుండెను. మే మచటికి వచ్చుట, వా రందఱికిని సంతోషదాయక మని వారు చెప్పిరి. నాయఁడుగారిని గలసి మాటాడితిని. కాని, యిటీవల కళాశాల తరగతులకె బోధనము చేయుచు వచ్చిన నాకు పాఠశాలలో ప్రథమోపాధ్యాయ పదవి నిచ్చుట కాయన కొంత యనుమానించెను. ఇట్టి పరిస్థితులలో స్థానము గదలుట యయుక్తమని నేను దలపోసి యూరకుంటిని.

నా మిత్రులును, గుంటూరుకళాశాలలో నుపన్యాసకులు నగు పసుపులేటి వెంకటకృష్ణయ్యనాయఁడుగా రిటీవల చనిపోయిరి. ఆ యుద్యోగ మిపుడు ఖాళియయ్యె నని విజయనగరము కళాశాలా విద్యార్థియు, నా కిటీవల పరచితుఁడును నైన గుంటూరు వాస్త