పుట:2015.373190.Athma-Charitramu.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. విజయనగర నివాసము 457

తమరే రాజమంద్రిలోఁ బ్రచురింప మొదలిడిరి. నేనుమాత్రము ఆపత్రికకు యథా ప్రకారముగ సంపాదకునిగనుండి, వ్యాసముల నంపుచువచ్చితిని. కాని, నాకుఁ జెప్పకయే, తమ కుండెడి కొన్ని చిక్కులవలన, వారు 1907 జూలయినుండియు ఆపత్రిక ముద్రణమును విడిచిపెట్టిరి. కళాశాలలో పనియెక్కువయై, చికమకలు పడుచుండు నేను వెనువెంటనే పత్రికను వేఱొక ముద్రాలయమున కంపనుపేక్షించితిని. అంత, కొలఁదిమాసములకు నేను విజయనగరమునుండి సంసారము తరలించుట వలన, 'జనానాపత్రికా' ప్రచురణ మంతటితో నిలిచిపోయెను. ఇట్లు 12 సంవత్సరములు నాపోషణమునఁ బెరిఁగిన యాపత్రిక, పదునాలుగవయేట నకాలమరణమునకు లోనయ్యెను.

6. విజయనగరనివాసము

మొత్తముమీఁద విజయనగరము కళాశాలలోని పని నాకెంతో హర్ష దాయకముగ నుండెను. ఇపుడు నేను బోధించవలసినవి కళాశాల శాఖలోని తరగతులు మాత్రమే. దినమునకు రెండుమూఁడు గంటలు మాత్రమే నేను బనిచేయవలసివచ్చెను. నాపనితీఱిన పిమ్మట నే నింటికిఁ బోయి హాయిగ విశ్రమింపవచ్చును. కాని, తీఱిక సమయమును నేను వ్యర్థపుచ్చువాఁడనుకాను. బోధింపవలసిన సంగతులు గ్రహించుటకై సదా నేను ఉద్గ్రంథపఠనము చేయువాఁడను. పట్టపరీక్ష తరగతికి బోధించుట కై తర్కశాస్త్రగ్రంథములు సమగ్రముగఁ జదువ నారంభించితిని. ఆంగ్ల సాహిత్య బోధనమున కవసరమగు గ్రంథములును నేను బఠియించితిని. నూతనగ్రంథపఠనము నాకు నిత్యకర్మానుష్ఠానమే గాక, విశేష వ్యసనముకూడ నయ్యెను ! ఆకళాశాల కంటియుండు పుస్తక భాండాగారము మిగుల గొప్పది. నాబో