పుట:2015.373190.Athma-Charitramu.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 456

మాఱకుండి'రని జయఘోషమిడుచున్నారు. ఆజయమును వీరే కైకొననిండు. * * * "ఈవిధముగ పంతులుగారు మరల కత్తిదూసి, ప్రతిపక్షులతోడి యుద్ధమునకు సన్నద్ధులైరి. శాంతముగఁ బనులు చక్కపెట్టుకొనుచు, పత్రికాపుత్రిక నెటులో పండ్రెండేండ్లవఱకును బెంచిన నేను, పంతులవారి శౌర్యోద్ధతివలన పత్రిక కేమిహాని వాటిల్లునో యని లోన భీతిల్లుచుంటిని.

ఈకారణమునఁ గాకపోయినను, వేఱొక కారణముచే 'జనానాపత్రికా' ప్రచురణమున కిపుడు వ్యాఘాతము సంభవించెను. శరీరాస్వస్థతవలనను, విద్యాలయాదిసంస్థలలో నిమగ్ను లై యుండుటచేతను పంతులుగారు 'జనానాపత్రిక' ను 1905 సంవత్సరము జూలయి నుండియు తమ 'చింతామణీముద్రాలయము'నఁ బ్రచురింప నుపేక్షించిరి ఆఱునెలలవఱకును పత్రిక జరుగనేలేదు. 13 వ సంపుటము 1, 2 సంచికలను 1906 వ జనవరి - ఫిబ్రవరినెలలో, వెనుకటి మద్రాసు అల్బీనియనుముద్రాలయమున నేనంత ముద్రింపించితిని. అప్పటినుండి నేనే 'జనానాపత్రిక'ను నడిపితిని.

పత్రికాప్రకటనమునం దింకొకరి సాయము నే నేమాత్ర నుపేక్షించినను, పత్రికకు ముప్పు వాటిల్లుచునేయుండెను. ఇపుడు పంతులువారియొద్దనుండి 'చింతామణి' ముద్రాలయమును గొని, రాజమంద్రిని దానిని జరుపుచుండెడి సత్యవోలు గున్నేశ్వరరావు గారితో 'జనానాపత్రిక' విషయమై నాకుఁ గలిగెడి యిక్కట్టులను గుఱించి 1906 అక్టోబరులో నేను బ్రస్తావింపఁగా, తాము సంతోషపూర్వకముగ నే తత్పత్రికకు యజమానులై, స్త్రీవిద్యాభివృద్ధికొఱ కేర్పడిన యీపత్రిక కాంధ్రదేశమున నత్యధికప్రచారము గలిగింతుమని చెప్పి, అ నవంబరునుండియు 'జనానాపత్రిక' ను