పుట:2015.373190.Athma-Charitramu.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. "జనానా పత్రిక" 455

ఆ సంవత్సరము డిసెంబరులో నేను రాజమంద్రి పోయి, అచట నిపుడు నివాస మేర్పఱుచుకొనిన వీరేశలింగము పంతులుగారిని సందర్శించి, వా రక్కడ నూతనముగ స్థాపించి జరుపుచుండు 'స్త్రీవిద్యాలయము'ను 'జనానాతరగతుల'ను జూచి సంతోషించి, వీనినిగుఱించి "జనానాపత్రికలో వ్రాసితిని. ఆనెల 15 వ తేదీని, విదుషీమణియు, అబలాసచ్చరిత్రరత్న మాలా" గ్రంథకర్త్రియు, కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారి యక్కగారునునగు శ్రీమతి భండారు అచ్చమాంబగారు లోకాంతరగతులైరి. ఆనెల జనానాపత్రికలో నామెనుగుఱించి యించుక ప్రస్తావించి, మఱుసటినెలలో సచిత్రవ్యాసమొకటి పంతులుగారు వ్రాసిరి.

వీరేశలింగముపంతులుగారి రచనా సామర్థ్యము లోకవిదితము. ఇట్టిప్రతిభావంతు లయ్యును, ఒక్కొక్కపుడు వారు చిన్న చిన్న సంగతులయందే పరులతో వాదమునకుఁ గాలు ద్రవ్వుచుండువారు. 1905 సం. ఏప్రిలు - మేయి "జనానాపత్రిక" సంచికలో, "జనానాపత్రిక - సావిత్రి" అనుశీర్షికతో మరల వెనుకటి విషయమును ప్రస్తావించి, వారిట్లు వ్రాసిరి : - "గత సంవత్సరము అక్టోబరు జనానాపత్రికలో ప్రకటింపఁబడిన 'సావిత్రీ సత్యవతీ సంభాషణము' పైని నవంబరు డిసెంబరు నెలల సావిత్రీ పత్రికలోఁ గొన్ని యపాత్రపు వ్రాఁతలు వ్రాయఁబడినవి. అవివేకుల దూషణములకు బదులు వ్రాయుట యుచితము కాదని భావించి, మే మావ్రాఁతల నుపేక్షించి యూరకుంటిమి. దురభిమానులైన మాప్రతిపక్షు లది మాయసమర్థతగా భావించి, యీనెల 'యార్యమతబోధిని' లో, 'మన్యము వెంకట సుబ్బమ్మగారిచ్చిన పత్రికకును, వేసిన పందెమునకును మాఱుపలుకఁ జాలక పంతులవారును తదనుచరులును, గతించినదానికి చింతిల్లుచు