పుట:2015.373190.Athma-Charitramu.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 454

ఖండనమునకుఁ గోపించి, యాపత్రికలలోని రచయితలు ప్రత్యుత్తరము లీయఁజొచ్చిరి. తోడి పత్రికలతో వివాదలు పెట్టుకొనుట నాపద్ధతి కాదు. సామమార్గముననే నాకార్యములు చక్క పెట్టుకొనుచువచ్చితిని. కాని, కోపస్వభావులగు పంతులుగారు నాతోఁగూడి వచ్చుటయే దుర్ఘటమైన యీ పత్రికాసమష్టిసంపాదకత్వప్రథమదశలోనే వారి కడ్డంకులు కలిగింప నేను వెఱచి, ఉదంతములెట్లు పరిణమించునోయని తటస్థముగఁ జూచుచుంటిని.

మేము 1905 వ సం. వేసవి సెలవులు గడుపుటకు చల్లని సముద్రతీరపట్టణమగు భీమునిపట్టణము వెళ్లితిమి. అక్కడకు నాతమ్ముఁడు కృష్ణమూర్తి మాతల్లిని, వెంకటరామయ్యభార్యను, చెల్లెలు కనకమ్మను, తనభార్యను గొనివచ్చెను. మాకుటుంబములో నిపుడు పిల్లలు బయలుదేఱుచుండిరి. వెంకటరామయ్యకుమా ళ్లిఱువురును, కనకమ్మపుత్రిక లిద్దఱును, కృష్ణమూర్తికొమార్తెయు నిపుడు మాతో నుండిరి. భీమునిపట్టణము మిగుల రమ్యమగు చిన్నపురము. రెండు ప్రక్కలను పట్టణమునంటి సముద్రము కలదు. సాయంకాలమునందు మే మందఱమును గలసి సముద్రతీరమున షికారుపోవుచుండువారము. మావలెనే యాచల్లనిప్రదేశమున దినములు గడుపుట కచటి కేతెంచిన విజయనగరము కళాశాలాధ్యక్షులగు రామానుజాచార్యులుగారు తమ రెండవకొమార్తెతో నడచివచ్చుచు నిత్యమును మా కెదురుపడుచుండువారు. కొందఱి మిత్రులప్రోత్సాహమున భీమునిపట్టణములో జరిగిన బహిరంగసభలో స్త్రీవిద్యావ్యాపనమును గుఱించి నేనొక యుపన్యాసము చేసితిని. రామానుజాచార్యులుగారు అధ్యక్షులుగనుండి నాయభిప్రాయములను సమర్థించిరి.