పుట:2015.373190.Athma-Charitramu.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 448

అప్పు తీఱిపోయిననాఁటనుండియు మాకు శిరమునుండి గొప్ప భారము తొలఁగిపోయినటు లయ్యెను. అంతకుఁ బూర్వము కష్ట భూయిష్ఠముగఁ దోఁచిన లోకయాత్ర మరల సుఖప్రదమును, ధర్మ నిర్వహణమున కనుకూలమును నయ్యెను. ఇపుడు మా కుటుంబమునకు బాధాకరములగు ఋణములేకాక, విశేషవ్యయముకూడ లేకుండెను. 1903 వ సంవత్సరాంతమున కృష్ణమూర్తి బోధనాభ్యసన కళాశాల విడిచి, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు భీమవరమున నూతనముగ స్థాపించిన విద్యాలయమున బోధకుఁ డయ్యెను. ఇట్లు మాసోదరుల మెవరి కుటుంబపోషణమువారు జరుపుకొనుటకు వలయు సమర్థత గాంచి, కాలక్రమమున ధనమును, భూవసతిని సంపాదించు కొనఁగలిగితిమి.

నేను పర్లాకిమిడిలోఁ గడపినదినములు నా జీవితమం దెల్ల సుఖతమకాల మని చెప్పవచ్చును. ప్రాఁతబాధలు మఱచిపోయి, క్రొత్త ప్రదేశమున మంచి యుద్యోగమందిన నాకు, మనస్సున నూతనాశయము లిగురొత్తుచుండెను. అపుడు నావయస్సు 32 - 34 వ సంవత్సరముల మధ్యకాలము. కనుల కింపగు ప్రకృతిదృశ్యములు తండోప తండములుగ నా పురపరిసరముల నుండెను. కాలు సాగునట్టుగ నే నెంత దూరమైనను వాహ్యాళి కేగవచ్చును. రమ్యములగు పొదలు చెట్లును, మధుర రుతములు చేయు వివిధజాతుల పక్షులును, అనుదినమును నా కగఁబడెడి సామాన్యదృశ్యములే. చుట్టు నుండువారందఱు నావలెనే యాంధ్రులుగాక, భిన్న వేష భాషాచారములతో నొప్పెడి యోడ్రజనులు. వీరుకాక, పర్వతప్రాంతములనుండి కూరగాయలు కట్టెపుల్లలును గొనివచ్చి చౌకగ నమ్మెడి సవరవాండ్ర యమాయిక ప్రవర్తన మాశ్చర్యము గొలుపుచుండెను. ఇటు లనేకకారణముల వలన నా కీప్రదేశమందలి నివాస మత్యంతహర్ష దాయక మయ్యెను.