పుట:2015.373190.Athma-Charitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంధువియోగము 11

3. బంధువియోగము

గోపాలపురమున బాలభోగములందు లగ్న మానసుఁడనై నే నుండునపుడు, పిడుగువంటివార్త యొకటి మాకు వినవచ్చెను. మాపెద్దమేనమామ చామర్తి వెంకటరత్నముగారు కడచిన వేసవి తుది దినములందు కలపవర్తకమునకు భద్రాచలపరిసరములకుఁ బయనము గట్టెను. ఒకసాహుకారునొద్ద రాజమహేంద్రవరమున గుమాస్తాగా నుండి, అతనితో నిపుడు కలపవర్తకమున భాగస్వామియై యెక్కువగ డబ్బు సంపాదింపఁగోరి, బందుమిత్రులు వల దని వారించిను వినక మన్యప్రదేశముల కాయన ప్రయాణ మయ్యెను. కాని, గమ్యస్థానము చేరిన కొలఁదిదినములకే యాయన జ్వరపీడితుఁడై, ఉద్యమము విరమించుకొని యింటిమొగము పట్టెను. రాజమంద్రియందలి ఘనవైద్యు లెవరుగాని యాయనకు దేహస్వాస్థ్యముఁ గలిగింపనేరకుండిరి. ఇపు డాయన ప్రాణావశిష్టుఁ డయ్యె నని మాకు జాబు వచ్చెను. ఆ వానకాలమున మా తల్లిని మువ్వురు బిడ్డలను దీసికొని మానాయన పడవలో బయలుదేఱెను. అపుడే బొబ్బరలంకలాకు తెగిపోవుటచేత, ఈవలిపడవ లావలకుఁ బోవుటలేదు. మా తండ్రి మమ్మందఱిని యావలి పడవలో నెక్కించి, తాను వెనుకకు మరలెను. మిక్కిలి యలజడితో మే మంతట రాజమంద్రి చేరి, మా మేనమామ యదివఱ కొకటిరెండు దినములక్రిందటనే చనిపోయె నను దు:ఖవార్త వింటిమి. మా తల్లివిచారమునకు మేర లేకుండెను. మా మువ్వురు మేనమామలలోను ఈయనయే జ్యేష్ఠుఁడును ప్రయోజకుఁడును. కోప స్వభావుఁ డయ్యును, ఆయన కోమలహృదయము గల సత్పురుషుఁడు. చదువుకొనక దుస్సహవాసముల మరగి కాలము వ్యర్థపుచ్చెడి మా మూ