పుట:2015.373190.Athma-Charitramu.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. సుఖదినములు 447

కోర్టు పెట్టిరి. అతనిచేతఁ బనియుఁ బణమునంతఁ బుష్కలముగఁ గానఁబడెను. ఆ వేసవికాలమున నేను మాతమ్ముఁడును తణుకు తాలూకా వెళ్లి, మా కక్కడ మిగిలియుండిన భూములును రేలంగియిల్లును అమ్మివైచి, గోటేటిరాజుగారి యప్పు తీర్చివేసితిమి. ఆస్తియంతయు విక్రయించివేసినను మూఁడువేలరూపాయిల యప్పు మాకు మిగిలి యుండెను.

ఆ వేసవిని నా కింకొక చిన్న యుద్యోగము లభించెను. పర్లాకిమిడి కళాశాలలో విద్య నేర్చుకొనుటకై, విశాఘపట్టణ మండల మందలి పార్వతీపురమునుండి బెల్గాము మైనరు జమీందారు లిఱువురును తమ తల్లిగారితోఁగూడి పర్లాకిమిడి వచ్చిరి. ఆ జమీందారులకు సంరక్షకునిగను, ఉపాధ్యాయునిగను నెల కిఱువది రూపాయిల జీతముమీఁద దొరతనమువారు నన్ను నియమించిరి. నా కీక్రొత్తపని మొదట కష్టముగఁ గానిపించినను; రాజకుమారులు బుద్ధిమంతు లగుట చేతను, వారి జనని యగు రాణి సోదరునివలె నన్ను భావించి మన్నించుటచేతను, నా కేమియు నొత్తిడి కలుగలేదు. సత్పురుషులగు నీ రాజకుమారుల సావాసము నాకు శ్రేయోదాయక మయ్యెను. వా రిపుడు పెద్దవారలు సుగుణోపేతులునై, సంస్థానమును గడు సమర్థతతో సొంతముగఁ బరిపాలించుచు, ప్రతిభావంతు లగుట నా కెంతయు ముదావహముగ నున్నది.

నేను మాతమ్ముఁడును పట్టుపట్టి, యేఁడాది తిరుగకుండగనే ఋణ శేషమును దీర్చివైచితిమి. నెలకు సుమా రిన్నూఱురూపాయి లాతఁడును, నూఱు నేనును మా రాఁబడిలో మిగిల్చి, అప్పునంతయు నిచ్చి వేసి, కృతకృత్యుల మయితిమి.