పుట:2015.373190.Athma-Charitramu.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. క్రొత్తప్రదేశము 437

సరిగా లిఖింప మానివేసితిని. తీఱికసమయముల దొకింత వ్రాయుచు పిమ్మట కొంతకాలమునకు దినచర్య పుస్తకముల నుంచుటయే విరమించివేసితిని. కళాశాలను వేసవిసెలవులకు 2 వ మేయి తేదీని మూసిరి. పుస్తకములు, విలువగల సామానులు నొక మిత్రునింట వేసి మేము కాకినాడ బయలుదేఱితిమి.

2. క్రొత్తప్రదేశము

1902 వ సంవత్సరము వేసంగిలోఁ గొన్నిదినములు మాబావమఱఁది వెంకటరత్నముగారియింట నేను గడపితిని. ఇపుడాతఁడు కాకినాడలో కలెక్టరు కచేరిలో గుమాస్తాగా నుండెను. మాయప్పు త్వరలోఁ దీర్చి వేయుట యుక్తమని నా కాతఁడు బోధించెను.

మేయి నెలలో చివరభాగమున నేను రాజమంద్రి వెళ్లితిని. మా రాజమంద్రి నివేశస్థలములు అమ్మివేసి ఋణములు తీర్చుట మంచిదని నేను సోదరులకుఁజెప్పితిని. ఈవిషయమున పెద్దతమ్మునికి నాకు నభిప్రాయభేదమేర్పడెను.

ఈ సెలవులలో నేను జదివిన పుస్తకములలో ఫ్రెంచిరచయిత వ్రాసిన "స్త్రీరాజ్ఞి" అను పుస్తక మెన్నఁదగినది. నానాదేశపు స్త్రీల లక్షణము లాతఁడు వర్ణించి, తాను బరిణయము కాంక్షించినచో, సుదతులందఱి సౌందర్యమును దాల్చిన స్త్రీ పుడమినుండుట యసంభవము గాన, తాను బహభార్యత్వమున కొడంబడెద నని నుడివెను. దీనిలోనుండి గైకొనిన "గాబ్రియలు సోదరి" వృత్తాంతమును జనానాపత్రికలోఁ బ్రచురించితిని.