పుట:2015.373190.Athma-Charitramu.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 434

మంద్రికళాశాలలో నాకుఁ బరిచితులు. శ్రీయుతులు వేమూరి నారాయణమూర్తి, రాంపల్లి వెంకయ్యగార్లు గోదావరిమండల వాస్తవ్యులేయగుటచే, త్వరలో నాకు స్నేహితులైరి. ఓడ్రబోధకులగు శ్రీగంతాయతుగారు, తక్కిన యుపాధ్యాయులును, శీఘ్రమె నాకుఁ బరిచితులైరి. నా తరగతులలోని శిష్యులకు నాకును వేవగమే స్నేహ సౌహార్దము లేర్పడెను. ప్రతితరగతిలోను ఓడ్రులు పలువురుండుట చేత, వారిస్వభావాదులు గుర్తెఱుఁగుటకు నా కవకాశము కల్గెను. వారందఱికిని తెలుఁగు బాగుగఁ దెలియుటచేత, బోధనావిషయమగు కష్టము లెవ్వియు నాకుఁ గానఁబడలేదు.

పర్లాకిమిడిలో 'ప్రార్థనసమాజ' మదివఱకే యేర్పడి యుండెను. ఇతరచోట్లవలెనే యిచ్చటను సభ్యులలోఁ బలువురు విద్యార్థులు. అక్కడకుఁ బోయినప్పటినుండియు సమాజప్రార్థనము జరుపుటను గుఱించి నే నెక్కువశ్రద్ధ వహించువాఁడను. సామాన్యముగ నేనే ప్రార్థన జరిపి, యేదో విషయమును గుఱించి ధర్మోపన్యాసము చేయుచుండువాఁడను. ఆ ప్రదేశమునకు నేను గ్రొత్తవాఁడ నగుటచేత, నాపలుకులు వినుట కనేకులు వచ్చి, నా కెంతో యుత్సాహము గలిగించుచుండిరి. కాని నే నీప్రదేశమునకు వచ్చినప్పటి నుండియును, ఇదివఱకు సమాజ నాయకులుగ నుండిన సుందరరామయ్యగారు మందిరమున నడుగిడకుండుట నా కెంతయు నిరుత్సాహకరముగ నుండెను.

అనుదినమును షికారు పోవుచుండుట నా కభ్యాసము. ఇట్టి వ్యాయామమున కీపట్టణము మిగుల ననువుగ నుండెను. నిశ్శబ్దములగు ప్రదేశములు, దర్శనీయములగు నడవిచెట్లు, కొండలు, కనుమలు, సెలయేళ్లును నాకుఁ జిత్తాకర్షములుగ నుండెను ! ఒక్కొకప్పుడు రెండు