పుట:2015.373190.Athma-Charitramu.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 432

ననే జరుగుచుండెను. కావున నేను పర్లాకిమిడియం దడుగిడుట యే నూతన సౌఖ్యలోకమునో జొచ్చుటవలె నాకుఁ దోఁచెను ! రెయిలు బండి పట్టణము సమీపించుచుండఁగనే, కొండక్రింద చెట్లగుబురుల మధ్య గృహశిఖరములు గానవచ్చి, ఇచ్చటియిండ్లు ప్రకృతికాంతతో దాగురుమూతలాఁడుచున్నవా యనునట్లు తోఁపించెను ! చల్లని పిల్ల వాయువులు ప్రసరించు "సీతసాగరము" శీతసాగరమనియే భ్రమ నొందితిని ! ఇచటిజనుల వేషభాషాచారములు క్రొత్తలుగనుండి, మనస్సునకు వింతయగు నానందము గొలిపెను. నేనీ నూతన దేశమున, నూతనోద్యోగమునఁ బ్రవేశించి, నూతనవిద్య గఱపుచు, నూతనాశయముల మదిని నిలుపఁజొచ్చితిని !

వచ్చిన క్రొత్తఱికమున రెండుదినములు పైడిగంటమువారు నాకును తమ్మునికిని నాతిథ్య మొసఁగిరి. అంత కళాశాల కంటియుండు భోజనవసతిగృహమున భుజించుచు, అచటిమేడమీఁదిగదిలో బస చేసితిమి. కళాశాలాధ్యక్షులగు మంగు శ్రీనివాసరావుగారిని, మఱికొందఱు బోధకులను నేను జూచితిని. నే నిచటి కళాశాలలోని ప్రథమశాస్త్ర తరగతులలో 'శారీరశాస్త్రమును', ప్రవేశపరీక్షతరగతులలో నాంగ్ల సాహిత్యమును బోధింపవలయును. కళాశాలకు రెండుదినములు వెళ్లి నాపనులు చూచుకొంటిని. ఇంతలో జ్వరము రక్తగ్రహణియును నన్ను బాధించెను. అందుచేత సెలవు పుచ్చుకొని యింటనే యుండవలసినవాఁడ నైతిని. చుట్టును అడవి పెరిఁగియుండుటచేత, పట్టణములోనికి రాత్రులు చిఱుతపులులు వచ్చు చుండు నని జనులు చెప్పిరి. ఒకనాఁడు పట్టపగలే పెద్ద చిఱుతపులియొకటి మాదాపున నుండు వొక యింటఁ బ్రవేశించెను ! ఆ యింటియాఁడుది చొరవతోఁ దలుపుమూసి, బయట గొళ్లెము పెట్టి, కేకలు వేసెను. చుట్టుపట్టులనుండి జనులు వచ్చి,