పుట:2015.373190.Athma-Charitramu.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 428

వెంకటరామయ్యతోఁ గూడి క్రొత్తప్రదేశమునకు వెంటనే బయలు దేఱితిని.

రాత్రి నౌపడా రెయిలుస్టేషనులో మేము సుందరరామయ్యగారిని గలసికొని మాట్లాడితిమి. వెంటనే యుపద్రవ మేమియుఁ గలుగకపోయినను, కళాశాలా పరిస్థితులు వెనుకటివలె నుండవేమో యని ప్రజలు భయపడుచుండి రని యాయన చెప్పిరి.

అంత 2 వ ఫిబ్రవరి యాదివారమునాడు మేము పర్లాకిమిడి చేరితిమి. మిత్రుఁడు పైడిగంటము కృష్ణారావుగారియింట మేము విడిసితిమి. స్నేహితులు, నితరులును పెక్కండ్రు మమ్ముఁ జూడవచ్చిరి. మే మొంటరిగ వచ్చుటచేత, కళాశాలా భోజనవసతిగృహము మేడగది నా విడిది యయ్యెను. 3 వ ఫిబ్రవరి సోమవారమున నేను కళాశాలకుఁ బోయి, నా క్రొత్తయుద్యోగమునఁ జేరితిని.