పుట:2015.373190.Athma-Charitramu.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 424

మంచిదని వారియొద్దనుండి యుత్తరము పుచ్చుకొని, నేను గుంటూరు పోయి, యచటి వైద్యాధికారితోఁ బరిచయము గలిగింపుఁ డని నామిత్రులు వెంకటకృష్ణయ్యనాయఁడు గారిని కోరితిని. కాని, వారికిని వైద్యాధికారియగు తమ్మనుసింగుగారికిని మిత్రభావము లేకుండుటచేత, నా కీసాయము గలుగ లేదు. వైద్యుఁడు నన్నుఁ బరీక్షించి, నాయందు హృద్రోగ చిహ్నములు గాన్పించెననియు, దొరతనమువారి కొలువులోఁ బ్రవేశింపవలదనియుఁ జెప్పిరి ! ఐనను నన్ను బాగుగఁ బరీక్షించి, నిజమంతయు వ్రాసివేయుఁ డని వైద్యుని నేను గోఱితిని ! పర్యవసాన మేమన, నేను ప్రభుత్వోద్యోగమున కనర్హుఁడ నని వైద్యుఁడు వ్రాసివేసెను !

నాయఁడుగారికిని తమ్మనుసింగుగారికినిత గల వైషమ్యములే నాదురదృష్టమునకుఁ గారణ మయ్యె నని పలువురు తలంచిరి ! నే నంత గుంటూరు నుండియే 11 వ జనవరిని రెండు తంతుల నంపితిని. ఒకటి పరీక్షాధికారికి, - నాకు వైద్యుఁడు కావలసిన సర్టిఫికెటు నీయలే దనియు, రెండవది పర్లాకిమిడి కళాశాలాధికారికి, - నేను వారి కళాశాలలో నుద్యోగము స్వీకరించితి ననియును, మఱునాఁడు ఉదయముననే నేను బెజవాడ వచ్చితిని. నా యలౌకిక చర్య కందఱు నాశ్చర్యపడిరి. దొరతనము వారికొలువు చేర నిశ్చయించుకొనినవాఁడు, వైద్యునియొద్దకు పొడిచేతులతోఁ బోవుటకు వారు నవ్విరి !

నాకు పర్లాకిమిడి యుద్యోగ మిచ్చితి మని తంతి యింకను రాలేదు. పెద్ద పరీక్షాధికారిని జూచి, వారిసాయమున నెటులో దొరతనమువారికొలువున నుద్యోగము సంపాదింపవలె నని యెంచి, ఆయన మకాముచేసియుండు నెల్లూరుపురమునకు నే నంతట వెళ్లితిని