పుట:2015.373190.Athma-Charitramu.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49. సూర్యనారాయణుని నిర్యాణము 421

నిని బెట్టితిమి. ఆతని మందులును శ్లేష్మము నరికట్టలేకపోయెను. సంధి విజృంభించి, రోగిదేహము వణఁకెను. రాత్రి 11 గంటలకు మా తమ్ముఁడు మృత్యువువాతఁ బడిపోయెను !

మా చిన్ని తమ్ముఁడు మరణమొందె నని మేము నమ్మలేకపోయితిమి ! ఆ ముద్దుమోము, దృఢకాయము, ఉన్నతాకారము, నయ వినయములు, అసమానబుద్ధి వికాసమును, తలపోసి తలపోసి మేము విలపించితిమి !

మాకు ప్రపంచ మంతయు నంధకారబంధుర మయ్యెను ! మే మిట్టి దు:ఖావస్థ నెపుడు ననుభవింపలేదు. 3 సంవత్సరముల క్రిందట మరణము నందిన మాతండ్రియు, గత సంవత్సరమం దీదినము లందు కాలగతినొందిన మాపినతల్లియు, కొంతకాలము జీవించిన యనుభవశాలురు. ఇపుడు చనిపోయిన మా తమ్ముఁడు వట్టి పసరిక పిందెయే ! ముద్దుమాటలు, కొంటెతనఁపుఁ జేష్టలును, - వీని నింకను సరిగా వీడనేలేదు ! అట్టి పిల్లవానికి సంభవించిన యకాలమరణమునకై మే మమితముగ వెతనొందితిమి. ఈ పాపిష్ట రాజమహేంద్రవరపట్టణ మిఁక వదలిపెట్టి, బెజవాడవంటి క్రొత్తప్రదేశమునకు సంసారము తరలించుట మంచి దని మే మందఱము తలంచితిమి. 'జనానాపత్రిక' 1902 సంవత్సరము జనవరిసంచికలో మాతమ్మునిగూర్చి నే నిట్లు వ్రాసితిని : - "ఈ పత్రికాధిపతి కనిష్ఠసోదరుఁడగు సూర్యనారాయణ యను 18 సం. వయస్సుగల చిన్నవాఁడు గత డిసెంబరు 24 వ తేదీని జ్వరపీడితుఁడై లోకాంతరగతుఁ డయ్యె నని తెలుపుట కెంతయు విచారకరముగ నున్నది. ఈతఁడు 'జనానాపత్రిక' కు వ్యాసములు వ్రాయుచువచ్చెను. విద్యాధికత చేతను, బుద్ధి తీక్షణముచేతను, వినయాది సద్గుణములచేతను శోభిల్లు