పుట:2015.373190.Athma-Charitramu.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 420

తిరుగఁబెట్టెనని యా రోజుననే నాకు జాబు వచ్చినను, వెంటనే బయలుదేఱలేకపోయితిని. బెజవాడలో వ్రాఁతపని పూర్తిపఱుచుకొని, 21 వ తేదీని ఏలూరు వెళ్లితిని. పర్లాకిమిడినుండి మద్రాసు తిరిగిపోవుచుండు పాలుపీటరుపిళ్ల గారిని నేను రెయిలుస్టేషనులోఁ గలసికొంటిని. పర్లాకిమిడి పనికి ఇద్దఱు యం. యే. లును, పెక్కు మంది యితరులును దరఖాస్తు పెట్టిరనియును, నా కది లభింపవచ్చు ననియును వారు చెప్పిరి. మా పెదతండ్రి కుమారుఁడు పట్టాభిరామయ్య చనిపోయెనను దు:ఖవార్త 22 వ తేదీ సాయంకాలమున నేలూరులో నాకుఁ దెలిసెను. మఱునాఁడు ప్రొద్దుననే యుభయులమును రాజమంద్రి బయలుదేఱితిమి.

49. సూర్యనారాయణుని నిర్యాణము

1901 డిసెంబరు 23 వ తేది సాయంకాలమునకు రాజమంద్రిలో దిగి మే మింటికిఁ బోవునప్పటికి, సూర్యనారాయణకు మిక్కిలి జబ్బుగా నుండెను. గత రాత్రియే వానికి సంధిగుణము ప్రవేశించె నని చెప్పి వెంకటరామయ్య విలపించెను. రోగి నన్నుఁ జూచి మిగుల సంతోషపడెను. నే నేమి క్రొత్తవస్తువులు తెచ్చితినో చూపుమని వాఁడు నన్నడిగెను. 'నాకు బందరుచెప్పులు తెచ్చి పెట్టితివా?" యని వాఁ డడుగునపుడు, లే దని చెప్పుటకు నేను మిగుల నొచ్చుకొంటిని. వైద్యుఁడు కోటయ్యనాయఁడుగారిని దీసికొనివచ్చి చూపించితిమి. రెండు శ్వాసకోశములును బంధించె ననియు, సన్ని పోతము ప్రబలె ననియును, ఆయన చెప్పివేసిరి. మేము క్రమముగ మందు లిచ్చుచు రాత్రి జాగరము చేసితిమి. మఱునాఁటికి వానివ్యాధి ముదిరెను. శ్లేష్మప్రకోపమువలన రోగి యొత్తిగిలలేకుండెను ! ఊపిరి పీల్చుట కష్టమయ్యెను. అంత దేశీయవైద్యు నొక