పుట:2015.373190.Athma-Charitramu.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. వీరేశలింగముగారి సాయము 413

1901 సెప్టెంబరునుండియు "జనానాపత్రిక" వీరేశలింగముగారి 'చింతామణిముద్రాలయము'న నచ్చొత్తింపఁబడెను. సెప్టెంబరు పత్రికలో నే నిట్లు వ్రాసితిని : - "తెలుఁగుజనానాపత్రిక" విషయమై మేము పడుచుండు కష్టములు చూచి స్త్రీవిద్యాభిమానులలో నగ్రగణ్యులగు శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు మా పత్రికను నడుపుభారము కొంత తాము వహించెద మని దయతో వాగ్దానము చేసియున్నారు. ఈ సాహాయ్యమునకు వారి కెంతయు కృతజ్ఞులము. ముందునుండి మా పత్రిక వారి ముద్రాక్షరశాలలో ముద్రితమై చెన్నపురినుండి ప్రకటింపఁబడును. చందాధనము చెన్నపురికిని, వ్యాసములు మున్నగునవి బెజవాడకును, బంపవలయును. * * *

" * * * శ్రీ పంతులుగారు మా పత్రికను చౌకగనే ముద్రింపించెదమని సెలవిచ్చిరి. పత్రికాప్రకటనము, చందాల వసూలు, మున్నగు కష్టకార్యము లన్నియు నుచితముగఁ జేయ పంతులుగా రంగీకరించిరి. వీరి యౌదార్యమునకు వందనములు చేయుచున్నాము. * * *

"శ్రీ వీరేశలింగముగారి యాదరణమున నీపత్రిక వర్థిల్లఁగలదని యెంచుచున్నాము."

మొదటినెలనుండియే వీరేశలింగముగారు మా పత్రికకుఁ దాము వ్యాసములుకాడ వ్రాయుచువచ్చిరి. సెప్టెంబరు అక్టోబరు సంచికల యందలి "శ్రీ అలెగ్జాండ్రామహారాజ్ఞి చరిత్ర"యు అక్టోబరు సంచికలోని "ఉత్తమమాత" యును, వీరు వ్రాసినవియే. ఈ సాయమే కాక, తమయొద్దనుండు ప్రతిమల దిమ్మెలు మా పత్రిక యుపయోగమునకు వీ రొసంగుచుండెడివారు.