పుట:2015.373190.Athma-Charitramu.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 408

మూఁడేండ్లక్రిందటనే యల్. టి. పరీక్షలో విజయ మందినను, పట్టభద్రులసభ కిదివఱకు నేను వెళ్లియుండలేదు. 1901 మార్చి 27 వ తేదీని నే నాసభకుఁ బోవుటకు మద్రాసు బయలు దేఱితిని. బండిలో నరసింహరాయఁడుగారు మున్నగు మిత్రులు కానఁబడిరి. చెన్నపురిలో స్నేహితులు కొల్లిపర సీతారామయ్య గారియింట నేను బసచేసి, పరశువాక మేగి, వీరేశలింగము బుచ్చయ్యపంతులుగార్లను జూచితిని. మద్రాసు స్టాండర్డు పత్రికా సంపాదకీయ వర్గములోని బి. వరదాచార్యులుగారిని సందర్శించితిని. ఆయన మరల న న్నాపత్రికకు బెజవాడ యుపవిలేఖకునిగ నుండుఁడని కోరి, దినపత్రిక నంపుచువచ్చిరి. స్కాటుదొరను జూచితిని గాని యాయన నా కేమియు సాయము చేతుననలేదు.

మేరీకారిల్లయి వ్రాసిన "వెండెట్టా", "మైటీ ఆటమ్" అను నవలలను ఏప్రిలు నెలలోఁ జదివితిని. "సైతానువెతల" వలెనే 'వెండెట్టా'యును మిగుల మనోహరమగు విషాదాంత కథయే.

అంత మాపాఠశాలకు సెలవు లగుటచేత, మేయి 5 వ తేదీని బతలుదేఱి, ఏలూరుమీఁదుగ రాజమంద్రి వెడలిపోయితిమి. రాజమంద్రి స్టేషను నుండియే యత్తయు భార్యయు కాకినాడ పోయిరి. మాతల్లియు తమ్ములును త మ్మీచర్య చిన్న పుచ్చెనని తలపోసిరి !

46. వీరేశలింగముగారి సాయము

మా చెల్లెలికూఁతుని భారసాల 8 వ మే తేదీని జరుగఁగా పిల్లను దీసికొని తల్లిదండ్రులు అర్తమూరు మఱునాఁడె వెడలి పోయిరి. మా తమ్మునిభార్యను, పిల్ల వానిని మోగల్లునుండి తీసికొని