పుట:2015.373190.Athma-Charitramu.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45. "చిత్రకథామంజరి" 407

మంజరి"ని బోలిన "చిత్రకథామంజరి" యను పేరిడితిని. ఈకథలలో మిగుల దీర్ఘమగునది "కృష్ణవేణి" ఇది కొంతవఱకు చరిత్రాత్మకమగు కథ యనవచ్చును. ఇటీవల చదివిన "కృష్ణామండల చరిత్రము" నుండి కొన్ని చిన్న యంశముల నూఁతగఁ గొని నే నీకథ నల్లితిని. ఇది నా కెంతో ప్రియమైనది. ఈ పుస్తకము మొదటి కూర్పులో చిత్రకథలు గానివికూడ కొన్ని చేర్పఁబడినవి. "నూర్జిహాను" "గాబ్రియలు సోదరి"యును చారిత్రగాథలే. 'ఉత్తమపుష్పము' ను చిన్నకథ యనుటకంటె వ్యాస మనియే చెప్పనగును !

మే మిటీవల బెజవాడలోఁ గొనినగేదెను కాయుటకు పొరుగుననుండు నొక బాలకుని నియమించితిమి. వాని యజాగ్రతచే నొకనాఁడది తప్పిపోయెను. దానిని వెదకుటకు వాని తలిదండ్రులు చూపిన యశ్రద్ధనుబట్టి వారల దుర్మంత్రములవలననే యీమోసము జరిగె నని మాకుఁ దోఁచెను. చుట్టుపట్టులగ్రామము లన్నియు నేను గాలించి వచ్చితిని. లాభము లేకపోయెను. పోలీసువారి వారింప లైన గమనింపక యాపిల్లవానితల్లి మమ్మూరక తిట్టిపోయసాగెను ! అంత పిల్లవానిమీఁదను వానితండ్రిమీఁదను మోసమునకు నే నభియోగము తెచ్చితిని. సబుమేజిస్ట్రేటు విచారణచేసి, పిల్లవానిని శిక్షించెను. కాని, పై న్యాయాధిపతి వానిశిక్షను రద్దుపఱిచెను.

ఇటీవల చనిపోయిన రానడిగారి సంగ్రహచరిత్రమును నే నాంగ్లమున వ్రాసి యొక బెజవాడసభలోఁ జదివి, "సంఘసంస్కారిణీ" పత్రికలోఁ బ్రచురించితిని. ఇంగ్లీషున "భీష్ము"ని గుఱించి యొక వ్యాసమువ్రాసి, రాజమహేంద్రవర ప్రార్థనసమాజవార్షిక సభలోఁ జదివించితిని. అదియు "సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రిత మయ్యెను.